చెన్నైః ప్రకృతి విలయంతో భీతిల్లిన చెన్నైవాసులను ఆదుకునేందుకు అటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇటు బీజేపీ ఎంపీలు ముందుకొచ్చారు. తమిళనాడు అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఒక నెల జీతాన్ని బాధితుల కోసం విరాళంగా ఇవ్వనున్నారు . ఈ విషయాన్ని పార్టీ అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారికంగా ప్రకటించారు. చెన్నై వరదల్లో సర్వం కోల్పోయి, కష్టాల్లో ఉన్న ప్రజలను రక్షించడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె హామీ ఇచ్చారు.
అటు బీజేపీ ఎంపీలందరూ తలా పదివేల రూపాయల చొప్పున చెన్నైలోని వరద పునరావాస కార్యక్రమాల కోసం విరాళంగా ఇవ్వనున్నట్టు కేంద్రమంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ తెలిపారు. మరోవైపు డీఎంకే నేత ఎంకె స్టాలిన్ చెన్నైలోని వరదముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధిత మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
కాగా ఇటీవలి వరదలతో చెన్నై సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలతో చెన్నై నగరం చిన్న ద్వీపంగా మారిపోయింది. పరిసర పట్టణాలు, ప్రాంతాలు నీటిమునిగి, ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే.