సాక్షి, చెన్నై:రాష్ట్రానికి చెందిన నలుగురు అన్నాడీఎంకే నాయకులు ఎంపీలుగా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం ఢిల్లీలో వీరి చేత రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు 18 మంది సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో జీకే వాసన్, జయంతి నటరాజన్ (కాంగ్రెస్), బాలగంగ (అన్నాడీఎంకే), జిన్నా, వసంతి స్టాలిన్(డీఎంకే), టీకే రంగరాజన్(సీఎం)ల పదవీ కాలం ఈ నెలతో ముగిసింది. ఈ స్థానాల భర్తీ నిమిత్తం లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి ఏడో తేదీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. తమకు ఉన్న సంఖ్యా బలం మేరకు నలుగురు అభ్యర్థులను అన్నాడీఎంకే ప్రకటించింది. ఐదో స్థానం మీద కూడా అన్నాడీఎంకే కన్నేసినా సీపీఎం అభ్యర్థన మేరకు వెనక్కు తగ్గింది.
డీఎంకే తమ అభ్యర్థిని నిలబెట్టడం, డీఎండీకే సైతం అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నాల్లో దిగడంతో ఎన్నికలు అనివార్యం అయ్యేనా అన్న ప్రశ్న బయలు దేరింది. అయితే, డీఎండీకే అభ్యర్థిని నిలబెట్టని దృష్ట్యా, నామినేషన్ల ఉప సంహరణ పర్వంలోనే తుది ఫలితం వెలువడింది. అన్నాడీఎంకేకు చెందిన నాలుగు, డీఎంకే, సీపీఎంలకు చెందిన తలా ఓ అభ్యర్థి నామినేషన్లు ఏకగ్రీవం అయ్యాయి. రాజ్య సభ ఎంపీలుగా: ఏక గ్రీవ ఫలితంతో అన్నాడీఎంకే అభ్యర్థులు శశికళ పుష్ప, విజిలా సత్యానంద్, ముత్తుకరుప్పన్, సెల్వరాజ్ రాజ్యసభ సభ్యులు అయ్యారు. అలాగే, డీఎంకే అభ్యర్థి తిరుచ్చి శివ, సీపీఎం అభ్యర్థి టీకే రంగరాజన్‌లు రెండో సారి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. అయితే, వీరు ప్రమాణ స్వీకారోత్సవానికి వేచి ఉండాల్సి వచ్చింది. అన్నాడీఎంకే అభ్యర్థుల ప్రమాణ స్వీకారం సోమవారం జరుగుతుందంటూ రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రకటించారు.
దీంతో ఆదివారం కొడనాడు వెళుతున్న జయలలిత ఆశీస్సుల్ని అందుకున్న నలుగురు సభ్యులు ఢిల్లీకి వెళ్లారు. ఉదయం రాజ్యసభ హాల్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీలుగా ఆ నలుగురు బాధ్యతలు చేపట్టారు. అన్నాడీఎంకే సభ్యులు శశికళ పుష్ప, విజిలా సత్యానంద్, ముత్తుకరుప్పన్, సెల్వరాజ్ చేత హమీద్ అన్సారీ ప్రమాణ స్వీకారం చేయించారు. అక్కడి అధికారులు, హమీద్ అన్సారీ కొత్త సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నలుగురి ప్రమాణ స్వీకారం ముగియడంతో మిగిలిన డీఎంకే తిరుచ్చి శివ, సీపీఎం టీకే రంగరాజన్ ప్రమాణ స్వీకారం ముహూర్తం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి. రాజ్యసభ నుంచి ఆహ్వానం వచ్చిన మరుక్షణం ఢిల్లీ వెళ్లి ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ ఇద్దరు సభ్యులు సిద్ధంగానే ఉన్నారు.
ఎంపీల ప్రమాణ స్వీకారం
Published Tue, Apr 29 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM
Advertisement
Advertisement