మీడియాతో మాట్లాడుతున్న అధికారులు
సాక్షి, చైన్నె : అంతర్జాతీయ స్థాయిలో చైన్నె వేదికగా ఎలక్ట్రిక్ వాహనాల ట్రేడ్ ఫెయిర్ ఏర్పాటు చేయాలని ఝార్ఖండ్ ప్రభుత్వం, ఫ్యూచర్స్ ట్రేడ్ ఫెయిర్ అండ్ ఈవెంట్స్ నిర్ణయించాయి. చైన్నె నందంబాక్కం ట్రేడ్ సెంటర్‌లో ఈనెల 26 నుంచి మూడు రోజల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. సోమవారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఫ్యూచర్స్ ట్రేడ్ డైరెక్టర్ నమిత్ గుప్తా మాట్లాడుతూ, 2022లో 10 లక్షల యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు దేశంలో విక్రయాలు జరిగినట్టు వివరించారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ పురోగతి, సామర్థ్యాన్ని చాటే విధంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. సమావేశంలో నిర్వాహకులు స్వామి ప్రేమ్ అవినాశ్, ఎం. ఇల్లాహి, సతీష్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ముఖేష్ పాల్గొన్నారు.
వండలూరు జూకు మైసూరు ఎలుగుబంట్లు
కొరుక్కుపేట: జంతుమార్పిడి కార్యక్రమంలో భాగంగా మైసూర్ నుంచి రెండు ఎలుగుబంట్లను వండలూరు జూపార్కుకు సోమవారం తీసుకొచ్చారు. రెండేళ్ల వయసున్న మగ ఎలుగుబంటి పేరు అప్పు అని, ఏడాదిన్నర వయసున్న ఆడ ఎలుగుబంటి పేరు పుష్ప అని అధికారులు తెలిపారు. వీటిని అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక పర్యాటకులకు అరుదైన ఎలుగుబంట్లను చూసి కొత్త అనుభూతిని పొందుతున్నారు.
మలేషియా మురుగన్‌కు చైన్నె సారె
కొరుక్కుపేట: ఇతర రాష్ట్రాలు, దేశాల్లోని దేవాలయాలతో సామరస్యపూర్వక సంబంధాలను మెరుగుపరిచేందుకు తమిళనాడు దేవదాయ శాఖ కొత్త సంస్కృతికి నాందిపలికింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సూచనతో ఆయా రాష్ట్రాలు, దేశాలల్లోని దేవాలయాలకు ఇకపై నూతన వస్త్రాలతో కూడిన సారె అందించాలని నిర్ణయించింది. ఈక్రమంలో మలేషియాలోని మురుగన్, వినాయక ఆలయాలకు వస్త్ర, మాలలు అందించినట్టు హిందూ ధార్మిక దర్మాదాయ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఇప్పటి వరకు తమిళనాడులోని మదురైలోని వినాయగర్ ఆలయం, మీనాక్షి సుందరేశ్వరాలయం, అలఘర్ ఆలయం, పళని, దండాయుదపాణి స్వామి ఆలయం, చైన్నె లోని మైలాపూర్ కాపాలీశ్వదేవాలయం, తిరుత్తణి, శ్రీవిల్లిపుత్తూరు ఆలయాలకు రాష్ట్ర హిందూ ధర్మదాయ శాఖమంత్రి పీకే శేఖర్ బాబు సూచనల మేరకు గౌరవ వస్త్రాలు అందించామన్నారు. అదేక్రమంలో మలేషియాలో మురుగన్, వినాయక ఆలయం, కర్ణాటక, ఆంధ్రా తదితర రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సైతం సారె అందించనున్నట్లు పేర్కొన్నారు.
1.5 కిలోల బంగారం స్వాధీనం
తిరువొత్తియూరు: మదురై ఎయిర్‌పోర్ట్‌లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 1.5 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని సెంట్రల్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. మదురై విమానాశ్రయం నుంచి దుబాయ్ నుంచి మదురైకి వచ్చే స్పైస్ జెట్ విమానంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు కేంద్ర కస్టమ్స్ శాఖకు సమాచారం అందింది. దీంతో ఆదివారం రాత్రి దుబాయ్ నుంచి మదురై ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేశారు. రామనాథపురం జిల్లా కీల్‌కరై ప్రాంతానికి చెందిన నసీమ్ వీర పాండియన్ అనే ప్రయాణికుడి వద్ద 1.5 కేజీల బంగారం ఉండడడంతో సీజ్ చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment