బార్‌కు సీల్ వేస్తున్న పోలీసులు
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బార్‌లను గుర్తించిన పోలీసులు 75 బార్‌లకు సీల్ వేశారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి, గుమ్మిడిపూండి, తిరువళ్లూరు, తిరుత్తణి, ఆర్కేపేట, పళ్లిపట్టు, ఊత్తుకోట తదితర ఏడు తాలుకా పరిధిలో 137 టాస్మాక్ దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఈ దుకాణాలకు కాకలూరులోని గోధాము నుంచి మద్యం సరఫరా చేస్తున్నారు.
కాగా 137 టాస్మాక్ దుకాణాలకు సమీపంలో బార్ నిర్వహించుకోవడానికి 20 మందికి మాత్రమే గతంలో అనుమతి ఇచ్చారు. మిగిలిన దుకాణాలకు సమీపంలో బార్‌లను నిర్వహించుకోవడానికి గత ఆగస్టు19న వేలం వేయగా మరో 36 దుకాణాల వద్ద బార్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు. మిగిలిన టాస్మాక్ దుకాణాలకు సమీపంలో బార్ నిర్వాహణకు అనుమతి లేదు.
ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా జిల్లా వ్యాప్తంగా వందకు పైగా బార్‌లను నిర్వహిస్తున్నట్టు తిరువళ్లూరు ఎస్పీ పకెర్లా సెఫాస్ కల్యాణ్‌కు ఫిర్యాదులు అందాయి. దాడులు నిర్వహించాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు. దీంతో 10 బృందాలుగా ఏర్పడిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న 75 బార్‌లను గుర్తించి సీజ్ చేశారు.
బార్‌లో రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. కాగా అనుమతి లేని బార్‌ల సీజ్ వ్యవహరంపై ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల విల్లుపురం, చెంగల్‌పట్టు జిల్లాలో కల్తీసారా తాగి 20 మందికి పైగా మృతి చెందారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి జిల్లాలో రాకుడదన్న ఉద్దేశంతోనే దాడులు నిర్వహించి అనుమతి లేని బార్‌లను సీజ్ చేశామని తెలిపారు. భవిషత్తులోనూ మరిన్ని దాడుల చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment