సాక్షి, చైన్నె: బయట మార్కెట్‌లో టమాట ధర అమాంతంగా పెరుగుతోంది. దీంతో చౌక దుకాణాల ద్వారా టమాట విక్రయాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోమవారం సహకార మంత్రి పెరియకరుప్పన్ నేతృత్వంంలో జరిగే సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రాష్ట్రంలో వారం రోజులుగా టమాట ధరలు పెరుగుతూ వచ్చాయి. ప్రభుత్వ జోక్యం, ప్రభుత్వ ఉద్యాన వనాల పరిధిలోని తోట, పచ్చదనం దుకాణాలలో టమాట విక్రయాలు జరగడంతో బయట మార్కెట్‌లో రెండు రోజులపాటు ధర కాస్త దిగి వచ్చినట్టు కనిపించింది.
అయితే, మళ్లీ ధరకు రెక్కలు వచ్చాయి. ఆదివారం కిలో టమాట బయటి మార్కెట్‌లో రూ.120 నుంచి రూ.130 వరకు పలికింది. అయితే, తోట పచ్చదనం దుకాణాలలో మాత్రం రూ. 60కు విక్రయించడం విశేషం. ఈ ధర కట్టడి చేయలేని పరిస్థితి ఉండడంతో ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న 35 వేల చౌక దుకాణాల ద్వారా టమాట విక్రయాలపై సహకార శాఖ దృష్టి పెట్టింది. సోమవారం అధికారులతో అత్యవసర సమావేశానికి మంత్రి పెరియకరుప్పన్ నిర్ణయించారు. సమావేశానంతరం చౌకదుకాణాల్లో టమాట విక్రయాల ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment