కండలేరు నీటిని విడుదల చేయండి
తిరువళ్లూరు: చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే పూండి, చెమరంబాక్కం, పుళల్‌లో నీటిమట్టం తగ్గుతున్న క్రమంలో కండలేరు నుంచి నీటిని విడుదల చేయాలని తమిళనాడు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ క్రమంలో లేఖకు ఆంధ్ర అధికారులు స్పందిస్తూ ఏప్రిల్ మొదటి వారంలో కండలేరు నుంచి నీటిని విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాధానమిచ్చారు. చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్ పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్‌కు ఆంధ్రా నుంచి వచ్చే కృష్ణాజలాలతో పాటు వర్షాకాలంలో వచ్చే వర్షపు నీరే ప్రధాన ఆధారం. రెండు రాష్ట్రాల మధ్య జల ఒప్పందంలో భాగంగా ప్రతి ఏటా కండలేరు నుంచి 12 టీఎంసీల నీటిని విడతల వారిగా విడుదల చేయాల్సి వుంది. కండలేరు నుంచి వచ్చే నీటిని పూండిలో నిల్వ వుంచి అక్కడి నుంచి చెమరంబాక్కం, పుళల్‌కు తరలించి అక్కడ శుద్ధీకరణ చేసిన తరువాత చైన్నె ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల రిజర్వాయర్ల నీటి మట్టం వేగంగా తగ్గింది. దీంతో భవిష్యత్తులో చైన్నె తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాఽశఽం వుందని భావిస్తున్న అధికారులు కండలేరు నుంచి నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, ఏప్రిల్ మొదటి వారంలో కండలేరు నుంచి నీటిని విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment