సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇటీవలి కాలంలో అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని.. జాతీయ వృద్ధి కంటే అధిక వృద్ధితో వేగంగా దూసుకుపోతోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2014–15 నుంచి 2022– 23 మధ్య 118.2శాతం పెరిగితే.. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఏకంగా 155.7శాతం వృద్ధి సాధించిందని తెలిపింది. 2014–15 నుంచి ఇప్పటివరకు తెలంగాణ సగటున ఏటా 12.5శాతం వృద్ధి నమోదు చేయగా.. జాతీయ వృద్ధి 10.5 శాతమేనని పేర్కొంది.
2014–15తో పోల్చితే 2022–23 నాటికి దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగిందని.. ఇదే సమయంలో దేశ జనాభాలో రాష్ట్ర వాటా మాత్రం అంతే ఉందని వివరించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 2022–23లో రాష్ట్రం 12.93 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి సాధించినట్టు తెలిపింది.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూపొందించిన ‘ఎకనమిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ తెలంగాణ @ 10’ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ శనివారం ఈ నివేదికను ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్)’లో ఆవిష్కరించారు. అందులోని వివరాలివీ..
తలసరి ఆదాయంలో అగ్రగామి
రాష్ట్ర తలసరి ఆదాయం 2014–15 రూ.1,12,162కాగా.. 2022–23 నాటికి రూ.3,08,732కి పెరిగింది. జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.79,118 నుంచి రూ.1,72,000కి చేరింది. గత తొమ్మిదేళ్లలో జాతీయ తలసరి ఆదాయం 9.2 శాతం వృద్ధి సాధించగా.. తెలంగాణ 12.1శాతం వృద్ధి నమోదు చేసింది. అందుబాటులో ఉన్న 16 రాష్ట్రాల తలసరి ఆదాయం వృద్ధి లెక్కలను పరిశీలిస్తే.. 2022–23లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.
రంగాల వారీగా వృద్ధి ఇదీ..
► ప్రాథమిక రంగమైన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను పరిశీలిస్తే.. తెలంగాణ 2014–15లో ప్రస్తుత ధరల వద్ద 19.5శాతం వృద్ధి సాధించగా, 2022–23 నాటికి 21.1శాతానికి పెరిగింది. తొమ్మిదేళ్లలోనే ప్రాథమిక రంగంలో ఏడింతల వృద్ధి రేటును నమోదు చేసింది.
► ద్వితీయ రంగమైన తయారీ, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాల్లో రాష్ట్రం ప్రస్తుత ధరల వద్ద 2014–15 నుంచి 2022–23 మధ్య కాలంలో 186.2 శాతం వృద్ధి నమోదు చేసింది.
► రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, రవాణా, కమ్యూనికేషన్, ఇతర సేవలతో కూడిన తృతీయ రంగం అధిక చేయూత అందిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను స్థూల రాష్ట్ర విలువ జోడింపు (జీఎస్‌వీఏ)లో తృతీయ రంగం వాటా ఏకంగా 61.3శాతం కావడం గమనార్హం.
సొంత పన్నుల ఆదాయంలో 266% వృద్ధి
రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 2014–15లో రూ.29,288 కోట్లు ఉండగా.. 2022–23 నాటికి ఏకంగా 266శాతం వృద్ధితో రూ.1,06,949 కోట్లకు పెరిగింది. సగటున ఏటా 18.3శాతం వృద్ధి నమోదు చేసింది. రాష్ట్ర జనాభాపై అదనపు పన్నులు విధించకుండానే ఈ మేరకు ఆదాయం పెంచుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర బడ్జెట్ సైతం రూ.62,306 కోట్ల నుంచి రూ.2,04,085 కోట్లకు పెరిగినట్టు వివరించింది.
తొమ్మిదేళ్లలో జీఎస్‌డీపీ 155% వృద్ధి!
Published Sun, Jun 18 2023 5:20 AM | Last Updated on Sun, Jun 18 2023 5:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment