డోర్నకల్: అధిక ధర పలుకుతున్న టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డలపై దొంగల కళ్లు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కూరగాయల మార్కెట్‌లోని పలు దుకాణాల్లో ఇటీవల కూరగాయలు చోరీకి గురవుతున్నాయి. గాంధీసెంటర్లోని కూరగాయల మార్కెట్‌లో రాత్రి వేళల్లో దుకాణాలకు తాత్కాలిక నెట్ ఏర్పాటు చేస్తారు.
మార్కెట్‌కు నైట్‌వాచ్‌మన్ లేకపోవడం, ఇటీవల కూరగాయల ధరలు పెరగడంతో రాత్రి వేళల్లో పలు దుకాణాల్లోని కూరగాయలు చోరీకి గురవుతున్నట్లు వ్యాపారులు గుర్తించారు. బుధవారం ఉదయం కూరగాయల వ్యాపారి లక్‌పతి తన దుకాణం తెరిచి చూడగా అధిక ధర పలుకుతున్న టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డతోపాటు ఇతర కూరగాయలు చోరీ అయినట్టు గుర్తించి లబోదిబోమన్నాడు.
కర్ణాటకలో టమాటా పంట చోరీ
యశవంతపుర: కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటా ధరలు కిలో వంద రూపాయలను దాటాయి. దీంతో అందరి కళ్లు ఇప్పుడు టమాటాలపై పడ్డాయి. కర్ణాటకలో హసన్ జిల్లా బేలూరు తాలూకా గోణి సోమనహళ్లి గ్రామంలో టమాటా పంటను దొంగలు ఎత్తుకుపోయారు.
మంగళవారం రాత్రి తోటలోకి ప్రవేశించి, దాదాపు 60 సంచుల టమాటాలను కోసుకెళ్లారు. రైతు పొలంలోకి వెళ్లి చూడగా పంట మొత్తం మాయం కావడంతో హళేబీడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోయిన పంట ధర రూ.1.5 లక్షల వరకూ ఉంటుందని తెలిపాడు.
టమాటా తోటకు సీసీ కెమెరా రక్షణ
కర్ణాటకలోని హావేరి జిల్లా హానగల్ తాలూకా అక్కి ఆలూరు గ్రామంలో రైతు మల్లప్ప తన టమాటా తోటకు సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాటు చేసుకున్నాడు. ధరలు పెరగటంతో దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందని, అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పాడు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అటువైపు దొంగలు రాకుండా కాపలా కాస్తున్నట్లు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment