సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఐటీ బ్రాండ్ ప్రతిష్టను మరింత పెంచే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. నగరానికి పడమర వైపున ఉన్న ఐటీ కారిడార్‌ను ఆ ప్రాంతానికే పరిమితం చేయకుండా.. మిగిలిన తూర్పు, పడమర, దక్షిణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగిరం చేసింది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడలో ఉన్న ఐటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హబ్‌కు తూర్పు, ఉత్తరం, దక్షిణ ప్రాంతాల నుంచి లక్షలాది మంది వాహనాల్లో వస్తున్నారు. ఫలితంగా నగర రోడ్లపై వాహన రద్దీతో పాటు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘గ్రిడ్ (గ్రోత్ ఇన్ డిస్పర్షన్) పాలసీ’తో నగరం నలువైపులా ఐటీ రంగం అభివృద్ధి చెందనుంది. ఈ మేరకు పశ్చిమ ప్రాంత అవతల ఉన్న ఇండస్ట్రియల్ పార్కులను ఐటీ పార్కులుగా మార్చాలని నిర్ణయించారు.
నగరానికి పశ్చిమ ప్రాంతానికి ఆవల ఉన్న ఇండ్రస్టియల్ పార్కులను ఐటీ పార్కులుగా మారిస్తే ఐటీ ఫైనాన్సియల్ డి్రస్టిక్ట్‌పై ఒత్తిడి తగ్గుతుంది. 2013 మార్చి ఒకటో తేదీన ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన జీవో నంబర్ 20ను అనుసరించి ఓఆర్‌ఆర్ లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలకు తరలించాలని పేర్కొంది. దీంతో ఇప్పటికే ఉన్న కూకట్‌పల్లి, గాందీనగర్, బాలానగర్, మల్లాపూర్, మౌలాలి, సనత్‌నగర్‌లోని ఇండస్ట్రియల్ పార్కులు, ఉప్పల్, నాచారం, పటాన్‌చెరు, కాటేదాన్‌లోని పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతాలు, రామచంద్రపురంలోని ఏఐఈ ప్రాంతాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. (చదవండి: దేశంలోనే మొట్టమొదటి ఏసీ బస్‌బే @Hyd)
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో...
♦ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఐటీ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించారు.
♦ ఆధునిక వసతులు, పచ్చని ప్రాంతాలు, పాదచారులకు మార్గాలు, సైక్లింగ్ కోసం దారులు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజా రవాణా వ్యవస్థ, సామాజిక మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు.
♦ ఈ క్రమంలో ఎవరైనా భూమి కోల్పోతే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం లేదంటే టీడీఆర్ ఇవ్వనున్నారు.
♦ హైటెక్‌సిటీలోని సైబర్ టవర్స్ మాదిరిగా ఉత్తర ప్రాంతమైన కొంపల్లిలో త్వరలోనే ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు.
♦ వాయువ్య ప్రాంతమైన కొల్లూరు లేదంటే ఉస్మాన్‌సాగర్‌లోనూ ఐటీ పార్కును ఏర్పాటుచేయనున్నారు.
దశలవారీగా...
• తొలి దశలో కొంపల్లిలో, ఉప్పల్, పోచారం, నాచారం, కొల్లూరు, ఉస్మాన్‌సాగర్‌లో, కాటేదాన్, శంషాబాద్‌లోని పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతంలో ఐటీ పార్కులను అభివృద్ధి చేస్తారు. ఇవికాక మిగిలిన ప్రాంతాల్లో తదుపరి దశల్లో చర్యలు చేపడతారు.
• పశ్చిమ ప్రాంతానికి మినహాయించుకుని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మొత్తం ప్రాంతానికి గ్రిడ్ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
• గచ్చిబౌలి, కోకాపేట, మాదాపూర్, రాయదుర్గం, పుప్పలగూడ, ఖాజాగూడ, నార్సింగి, నానక్‌రామ్‌గూడ, కొండాపూర్, ఖానామెట్, గుట్టల బేగంపేట, మణికొండ, నల్లగండ్ల, గోపన్నపల్లి, గౌలిదొడ్డికి వర్తించవు.
• గ్రిడ్ ప్రోత్సహకాల నుంచి అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను మినహాయించనున్నారు. అయితే రాయితీల్లో భాగంగా యూనిట్ ఇన్సెంటివ్‌లు, యాంకర్ ఇన్సెంటివ్‌లు, డెవలపర్ ఇన్సెంటివ్‌లు, మౌలిక వసతుల అభివృద్ధి, బ్రాండింగ్ అండ్ ప్రమోషనల్ కార్యకలాపాలు చేపడతారు. రాయితీలు ఇలా..
• యూనిట్ ఇన్సెంటివ్‌లు: ఏడాదికి రూ.పది లక్షల యూనిట్ మించని వాటికి ఐదేళ్ల సయమానికి 30 శాతం రెంటల్ సబ్సిడీ ఇస్తారు. రూ.ఐదు లక్షల యూనిట్ మించని వాటికి మూడేళ్ల సమయానికి 25 శాతం రెంటల్ సబ్సిడీ ఇస్తారు.
• యాంకర్ ఇన్సెంటివ్‌లు: అంటే..500 మందికి మించి ఉద్యోగాలు ఇచ్చే సంస్థకు యాంకర్ యూనిట్ వర్తించనుంది.
• డెవలపర్ రాయితీలు: టీఎస్‌ఐఐసీ, ఐలా కింద ఉండే పారిశ్రామిక భూములను ఐటీ, ఐటీఈఎస్ కింద 50 శాతం బిల్టప్ ఏరియాను ఐటీకి, మిగిలిన 50 శాతం నాన్ ఐటీకి ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించారని తెలిస్తే జరిమానాలు విధించడంతో పాటు మంజూరు చేసిన రాయితీలను వెనక్కి తీసుకుంటారు. నాలాచార్జీలు వర్తించవు.
• ఆయా ప్రాంతాల్లో బడా కంపెనీలు ముందుకొస్తే మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ధి చేయనుంది. అలాగే ఆయా ప్రాంతానికి పేరు వచ్చేలా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment