
నాందేడ్-సంగారెడ్డి జాతీయ రహదారిపై ఢీకొన్న రెండు లారీలు
సాక్షి, నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని బ్రహ్మణపల్లి శివారులో గల నాందేడ్-సంగారెడ్డి జాతీయ రహదారిపై వెళుతున్న లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయాడు. దీంతో మూడుగంటలు నరకయాతన పడ్డ బాధితుడిని 108అంబులెన్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి బయటకు తీసి చికిత్స అందించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాందేడ్-సంగారెడ్డి జాతీయ రహదారిపై సోమవారం హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో వెనుక లారీ క్యాబిన్ నుజ్జునుజ్జ కావడంతో డ్రైవర్ ఇందూరే విఠల్(20) అందులోనే ఇరుక్కుపోయాడు.
వెంటనే స్థానికులు ప్రమాదాన్ని గమనించి 108అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే పిట్లం అంబులెన్స్ సిబ్బంది సుభాష్, విజయ్‌కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి డ్రైవర్‌కు ప్రథమ చికిత్స అందించి, సెలైన్ బాటిల్ ఎక్కించారు. రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న కార్మికులు, జేసీబీ సహయంతో క్యాబిన్‌లో ఇరుక్కున డ్రైవర్‌ను బయటకు తీసేందుకు మూడు గంటల పాటు శ్రమించారు. అప్పటికే డ్రైవర్ కాలు రెండు చోట్ల విరగడంతో అస్వస్థతకు గురయ్యారు. అంబులెన్స్ సిబ్బంది క్యాబిన్‌లోనే డ్రైవర్‌కు వైద్య చికిత్సలు చేస్తూ బాధితుడిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రుడు విఠల్‌కు మెరుగై చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో అంబులెన్స్ సిబ్బందిని స్థానికులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment