28 Crore Households Using Cooking On Firewood In India - Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ధర 2012లో రూ.410.. ఇప్పుడేమో 1100.. రీఫిల్‌కానీ సిలిండర్లు.. నేటికీ కట్టెలపైనే వంట!

Published Wed, Feb 15 2023 3:27 AM | Last Updated on Wed, Feb 15 2023 8:30 AM

28 Crore Households Using Cooking On Firewood In India - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌
ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా కర్బన ఉద్గారాల విడుదల కారణంగా రోజురోజుకూ భూతాపం పెరిగి అధిక ఉష్ణోగ్రతలకు దారితీస్తోంది. వాతావరణ మార్పుల వల్ల ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతున్నప్పటికీ ప్రజల ఆలోచ­నా తీరు మాత్రం మారడంలేదు. అధిక కర్బన ఉద్గారాల విడుదల కారకాల్లో ఒకటైన వంట చెరకు వినియోగం నేటికీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎల్‌పీజీ, సోలార్, విద్యుత్‌ వాడకం ఆశించిన స్థాయిలో పెరగకపోగా పాతకాలం తరహాలో కట్టెలు, పంట వ్యర్థాలు, పిడకల వినియోగం ఇంకా కొనసాగుతోంది.

తద్వారా అడవుల నరికివేత కూడా ఎక్కువవుతోంది. దేశంలో ఇంకా దాదాపు 44 శాతం మంది అడవుల నుంచి కలప, పంటల వ్య­ర్థాలు, పిడకలను వినియోగించి ఆహారం తయా­రు చేసుకుంటున్నారు. ఇటుకల తయారీకి కూడా కలప, పంటల వ్యర్థాలు వినియోగిస్తున్నారు. చిన్నచిన్న పరిశ్రమలు సైతం కట్టెలనే వాడుతున్నాయి. చివరకు బయోమాస్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు సైతం పంట వ్య­ర్థాలు కాకుండా ఏకంగా అటవీ కలపను వినియోగిస్తున్నాయి. మరోవైపు కలపతో బొగ్గు తయారీ కూడా చేస్తున్నారు. ఫలితంగా వెలువడుతున్న వాయు కాలుష్యంతో ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. ప్రపంచంలో ఈ తరహా మరణాలు చైనా తరువాత భారత్‌లోనే ఎక్కు­వని అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్నాయి.  

ఎల్‌పీజీ వినియోగం పెరిగినా.. 
దేశంలో దశాబ్దకాలంగా ఇళ్లలో ఎల్‌పీజీ వినియోగం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 30.5 కోట్ల ఎల్‌పీజీ గృహ వినియోగదారులున్నట్లు ఆయిల్‌ కంపెనీలు చెబుతున్నాయి. 2012లో రూ. 410 ఉన్న 14.5 కేజీల సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ. 1,100కు చేరుకోవడంతో వినియోగదారుల సంఖ్య పడిపోతోందని డీలర్లు చెబుతున్నారు.

ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన కింద ఉచితంగా దాదాపు 8 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చినా సిలిండర్‌ ధరలు మోయలేని భారంగా మారిన నేపథ్యంలో చాలావరకు రీఫిల్లింగ్‌కు రావడం లేదని పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు సమాచారం. మండల కేంద్రాల్లోనూ సిలిండర్ల పంపిణీ కేంద్రాలు తగిన స్థాయి లో అందుబాటులో లేకపోవడం, దూర ప్రాంతాల నుంచి సిలిండర్లను తెచ్చుకోవాల్సి రావడం వల్ల సిలిండర్‌ ధరతోపాటు రవాణా చార్జీలు కూడా తడిసిమోపెడవుతున్నాయి.

సిలిండర్‌ అయిపోయిన వెంటనే రీఫిల్‌ దొరుకుతుందన్న గ్యారంటీ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోవడం వల్ల కలపతో ఆహార తయారీకి మొగ్గుతున్నా రు. స్నానాలకు అవసరమైన వేడినీటి కోసం కలపనే వినియోగిస్తున్నారు.  పట్టణాల్లో ఎల్‌పీజీ వినియోగం దాదాపు 88.6 శాతం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో అది 42 శాతం మాత్రమే ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లోని గృహిణులు ఇంకా అడవుల నుంచి తెచ్చిన కలప, పంట పొలాల్లోని వ్యర్థాలు, పిడకలను వాడుతున్నారు.  

కలప కాలడం వల్ల వచ్చే..
కలప, పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడుతున్న వాయు కాలుష్యం వల్ల దేశంలో ఏటా 3.3 లక్షల మంది మరణిస్తున్నారని ‘లాన్సెట్‌ కౌంట్‌డౌన్‌ ఆన్‌ హెల్త్‌ అండ్‌ క్లైమేట్‌ చేంజ్‌’అధ్యయనం వెల్లడించింది. అదే చైనాలో 3.8 లక్షల మంది, యూరప్‌లో 1.17 లక్షల మంది, యూఎస్‌లో 32 వేల మంది మరణిస్తున్నారని వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా సుమా­రు దాదాపు 28 కోట్ల మంది ఇంకా కలప, పంట వ్యర్థాలను వినియోగించి ఆహారాన్ని తయారు చేసుకుంటున్నారని సమాచారం. వంట చెరకు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది మరణిస్తున్నారని పలు అంతర్జాతీయ సంస్థలు తమ సర్వేల్లో పేర్కొంటున్నాయి. ఎల్‌పీజీ వినియోగిస్తున్న వారిలోనూ 12 శాతం మంది రెండో ఇంధనంగా ఈ కలపను వినియోగిస్తున్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి. 

బొగ్గు డిమాండ్‌ను తగ్గించాలి... 
చెట్లను కొట్టేయడం వల్ల కర్బన ఉద్గారాలు పెరుగుతాయి. కొట్టేసిన చెట్టును బొగ్గుగా మార్చడానికి విద్యుత్‌ లేదా ఇతర రూపాల్లో ఇంధనం అవసరమవుతుంది. మళ్లీ బొగ్గును కాల్చినా అది కూడా కాలుష్యమే. ఈ రకంగా మూడు దశల్లోనూ కాలుష్యం ఉంటుంది. నల్లగొండ జిల్లాలో ఈ తరహా కలప కాల్చివేత ఎక్కువగా జరుగుతోంది. ఇదొక పాత విధానమైనా ఇంకా ఎందుకు అనుసరిస్తున్నారో అర్థం కావడం లేదు.

ఈ బొగ్గును అధికంగా చిన్నతరహా పరిశ్రమలు, ఇటుక బట్టీలు, హోటల్స్, దాబాల వంటి వాటిలో వాడుతున్నారు. వీటికి బొగ్గు సరఫరా పెంచితే ఇలాంటి బొగ్గు ఉపయోగించరు. అసలు బొగ్గే వద్దనుకుంటే సబ్సిడీపై విద్యుత్‌ ఇవ్వాలి. బాయిలర్‌ వంటివి ఎలక్ట్రిక్‌పై నడిచేవి అందుబాటులోకి తేవాలి. ముందుగా ఈ రకమైన

బొగ్గుకు ఉన్న డిమాండ్‌ను తగ్గించాలి. 
చెట్లు కొట్టేయకుండా చట్టాన్ని తీసుకురావాలి.పచ్చదనానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన డిమాండ్, సప్లయ్‌ను తగ్గించడం ద్వారా అనుకున్న ప్రయోజనాలు పొందొచ్చు. ప్రస్తుతానికైతే చెట్లకు, పర్యావరణానికి నష్టం కలగజేసే వాటిపై ప్రభుత్వపరంగా ఎలాంటి నియంత్రణలు, పర్యవేక్షణలు లేవు.  
– డాక్టర్‌ దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త, పాలసీ అనలిస్ట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement