రోడ్డు పక్కనే కదా హోటల్ అనుకొని తీసిపారేయకండి. ఈమె వద్ద ఒక్కసారి బోటికూర, తలకాయ మాంసం రుచి చూశారంటే ఇక రోజూ ఇటువైపు రావాల్సిందే.. అవును మరి.. బోటికూర లక్ష్మమ్మ పెట్టే తలకాయ మాంసం, మటన్ లివర్, బోటి కూర, చికెన్ కర్రీ కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, బడా వ్యాపారులు సైతం వచ్చి లొట్టలేసుకొని తింటుంటారు. సమపాళ్లలో మసాలా దినుసులు, ఇంట్లోనే తయారు చేసే కారంపొడి, కొబ్బరిపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో ప్రత్యేకంగా బోటీ వండుతుంటానని, రుచికి అదే కారణమని అంటుంటారు బోటికూర లక్ష్మమ్మ. – బంజారాహిల్స్
బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని షేక్‌పేట మండల కార్యాలయం వద్ద ఫుట్‌పాత్‌ను ఆనుకొని రోడ్డు పక్కనే రెండు దశాబ్ధాలుగా ఆమె నిర్వహిస్తున్న మొబైల్ మెస్‌లో టేస్ట్ చేస్తున్న ఎంతో మంది ప్రముఖులు శెభాష్ అనకుండా ఉండలేకపోతున్నారు. ప్రతిరోజూ 12 కిలోల బోటీ వండి వంద మందికి పైగానే ఆహారప్రియులకు అందిస్తున్నారు. అందుకే వరంగల్ జిల్లా ఉల్లిగడ్డ దామెర గ్రామానికి చెందిన గన్నారం లక్ష్మమ్మ(73) ఏకంగా బోటీకూర లక్ష్మమ్మగా పేరు తెచ్చుకుంది.
ఈమె బోటీ కూర గురించి ఇప్పటికే సుమారు 100 మంది యూట్యూబర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బోటీ కోసమే వారంలో ఒకటి, రెండుసార్లు ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వస్తుంటారు. తలకాయ మాంసం, మటన్ లివర్, మటన్ కూర, చికెన్ లివర్, చికెన్ కూర, ఇవన్నీ ఈమె వద్ద ప్రత్యేక రుచుల్లో లభిస్తుంటాయి. మరో నలుగురికి ఉపాధి బోటీ కూరను తానే స్వయంగా వండుతానని, ఇందులో వాడే ప్రతి మసాలా దినుసు తానే తయారు చేస్తుంటానని తెలిపారు.
రాహుల్ సిప్లిగంజ్‌కు వడ్డిస్తూ..
తాను సంపాదించడమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. లక్ష్మమ్మను చూసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శ్రీనగర్‌కాలనీ, ఎస్‌ఆర్‌నగర్ ప్రాంతాల్లో ఎంతోమంది మహిళలు స్ఫూర్తి పొంది ఇలాంటి మొబైల్ మెస్‌లు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఈమె టేస్ట్‌కు ఎవరూ సాటిరారంటూ చాలామంది యూట్యూబర్లు సైతం తమ అభిప్రాయాలు వెల్లడించడమే కాకుండా సోషల్ మీడియాలో లక్ష్మమ్మ బోటి కూర టేస్టే సెపరేట్ అంటూ పోస్టులు పెడుతుంటారు. అంతేకాదు స్విగ్గి, జొమాటో ఆర్డర్లు కూడా వస్తుండగా ఇప్పుడున్న గిరాకీ తట్టుకోలేక ఆమె సున్నితంగా తిరస్కరిస్తున్నారు.
ఎంతో ఆనందం..
బోటీ వండటానికి నాకు 3 గంటల సమయం పడుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ భోజనాలు ప్రారంభిస్తాను. మొదటి గంటలోనే వందకుపైగా బోటి కూర భోజనాలు అమ్మడవుతుంటాయి. కూర అయిపోగానే చాలా మంది వస్తుంటారు. లేదని చెప్పగానే నిరాశతో వెళ్తుంటారు. డబ్బులు సంపాదించడానికి వండటం లేదు.
ఉన్నంతలోనే మంచి రుచితో అందిస్తున్నాను. రాజకీయ నాయకుడు అద్దంకి దయాకర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, మరో సింగర్ బిట్టు, లేడీ సింగర్ లక్ష్మీతో పాటు చాలా మంది వస్తుంటారు. బాగుంది అని చెబుతుంటే ఆనందంగా ఉంటుంది. నాతో పాటు నా కూతురు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్లు ఏడు చోట్ల మెస్‌లు నిర్వహిస్తున్నారు. అన్ని చోట్లకు నేను వండిన బోటి కూర వెళ్తుంది. – లక్ష్మమ్మ
ఇవి చదవండి: 'సిగ్నోరా సర్వీస్ సెంటర్'! ఈ ముగ్గురు మహిళలు..
Comments
Please login to add a commentAdd a comment