పిడుగుపాట్లకు 9 మంది మృతి | 9 people died due to thunderstorm | Sakshi
Sakshi News home page

పిడుగుపాట్లకు 9 మంది మృతి

Published Fri, Jun 7 2024 4:47 AM | Last Updated on Fri, Jun 7 2024 4:47 AM

9 people died due to thunderstorm

మృతుల్లో ఎక్కువ మంది రైతులు, కూలీలే.. 

వర్షం కురుస్తున్న వేళ చెట్ల కిందకు వెళ్లడంతో పిడుగులు పడి మృత్యువాత 

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం పిడుగుపాట్లకు గురై 9 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. పలుచోట్ల పశువులు సైతం మృత్యువాతపడ్డాయి. మృతుల్లో ఎక్కువ మంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలే ఉన్నారు. వర్షం కురుస్తున్న వేళ చెట్ల కింద తలదాచుకుందామని వెళ్లిన వారిపై ఎక్కువగా పిడుగులు పడటంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. 

వ్యవసాయ పనుల కోసం వెళ్లి.. 
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గామ్‌ గ్రామానికి చెందిన దంపతులు అనక సంతోష్‌ (27), స్వప్న (24) వ్యవసాయ పనులు చేస్తుండగా వర్షం కురవడంతో టేకు చెట్టు కింద ఉన్న గుడిసెలో తలదాచుకున్నారు. చెట్టుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు.  

» మెదక్‌ జిల్లా హవేళిఘణాపూర్‌ మండల పరిధిలోని శమ్నాపూర్‌ గ్రామానికి చెందిన శెట్టబోయిన సిద్ధయ్య (50), అదే గ్రామానికి చెందిన ఓరుగంటి దుర్గమ్మ, రాజయ్య కుమారుడు నందు (22) గుడిసెపై కప్పేందుకు అవసరమైన పొరుక కోసం గ్రామ సమీపంలోని దుర్గమ్మగుట్టపైకి బుధవారం మధ్యాహ్నం వెళ్లారు. ఉరుములు, మెరుపులు రావడంతో ఓ చెట్టు కింద నిల్చోగా పిడుగుపడి సిద్ధయ్య, నందు మృతిచెందారు.  

» నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం కాల్వ గ్రామానికి చెందిన రైతు మూడపెల్లి ప్రవీణ్‌ (28) పొలంలో జీలుగ విత్తనాలు చల్లుతుండగా అతనికి సమీపంలో పిడుగు పడింది. దీంతో కుప్పకూలిన అతన్ని నిర్మల్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. 

» నిర్మల్‌ జిల్లాలోని తానూరు మండలం ఎల్వత్‌ గ్రామంలో మంగీర్‌వాడ్‌ శ్రీ(10) అనే బాలుడు తన తాతతో కలిసి మేకలను మేపేందుకు అడవికి వెళ్లి తిరిగొస్తుండగా పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు మేకలు మృత్యువాతపడ్డాయి. 

» సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలోని పీచేర్యాగడి గ్రామానికి చెందిన శివరాంపురం గోపాల్‌ వ్యవసాయ పనులు చేసేందుకు పొలానికి వెళ్లాడు.  వర్షం కురుస్తుండటంతో చెట్టు కిందకు వెళ్లగా పిడుగుపడి ప్రాణాలు కోల్పోయాడు. 

»  నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్‌కు చెందిన కొమ్మరెక్క జంగమ్మ (40), ఆమె భర్త కృష్ణయ్య, తల్లి ఈదమ్మ పొలంలో పత్తి విత్తనాలు విత్తుతుండగా వర్షం కురుస్తోందని చెట్టు కిందకు వెళ్లారు. పిడుగు పడటంతో జంగమ్మ మృతిచెందగా మిగిలిన ఇద్దరినీ స్థానికులు కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో కోలుకుంటున్నారు. 

» మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం పీర్లతండాకు చెందిన డలావత్‌ గేమ్యనాయక్‌ (60) పొలాల సమీపంలో గొర్రెలను మేపి ఇంటికి తిరిగొస్తుండగా పిడుగుపాటుకు గురై కన్నుమూశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement