సాక్షి, హైదరాబాద్: ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ విద్యార్థులకు శుభవార్త. కోవిడ్–19 నేపథ్యంలో మూతబడ్డ సంక్షేమ వసతిగృహాలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. విద్యా సంస్థలను ప్రారంభించినప్పటికీ వసతిగృహాలను తెరవకపోవడంతో విద్యార్థులకు బస ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో కొందరు ప్రైవేటు హాస్టళ్లలో డబ్బులు చెల్లించి వసతి పొందుతుండగా.. మరికొందరు రోజువారీ తరగతులకు హాజరు కాకుండా ఇంటివద్దనే ఉంటున్నారు. దీంతో విద్యార్థుల ఇబ్బందులను వివరిస్తూ విద్యార్థి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయి.
ఈ నేపథ్యంలో సంక్షేమ శాఖల పరిధిలోని ప్రీమెట్రిక్ హాస్టళ్లు, పోస్టుమెట్రిక్ హాస్టళ్లను ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతిగృహాలు తెరిచేందుకు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు కూడా ఈ దిశలో ఆదేశాలు జారీ చేయనున్నాయి. దసరా సెలవుల తర్వాత హాస్టళ్లను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
1,750 వసతి గృహాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,750 వసతి గృహాలున్నాయి. ఇందులో 650 కళాశాల విద్యార్థి వసతిగృహాలు కాగా మిగతావి పాఠశాల విద్యార్థుల వసతిగృహాలు. ఈ వసతిగృహాల పరిధిలో 2.27 లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఈ వసతిగృహాలన్నీ మూతబడ్డాయి. గత ఏడాది మార్చి రెండో వారంలో ఈ హాస్టళ్లు మూతబడగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో నెలరోజుల పాటు తాత్కాలికంగా తెరిచారు. తిరిగి కోవిడ్ వ్యాప్తి తీవ్రం కావడంతో మూసివేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు దసరా సెలవుల తర్వాత తిరిగి హాస్టళ్లకు చేరుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment