నీట మునిగిన హనుమకొండలోని గోపాల్‌పూర్ ప్రాంతం, హైదరాబాద్ మూసారాంబాగ్ వద్ద వరద పరిస్థితిపై అధికారులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
నేడు పది జిల్లాలకు రెడ్ అలర్ట్
రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం.. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను.. మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. పలు ప్రాంతాల్లో గంటకు 40– 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. అయితే పశ్చిమ, మధ్య బంగాళా ఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని, ఇకపై వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది.
ఇదే అతిపెద్ద వాన
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో నమోదైన 64.98 సెంటీమీటర్ల వర్షపాతమే రాష్ట్ర చరిత్రలో అత్యధి కమని వాతావరణశాఖ తెలిపింది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో నమోదైన 61.65 సెంటీమీటర్ల వర్షపాతం రెండో అతిపెద్ద రికార్డును నమో దు చేసినట్టు వెల్లడించింది. 2013 జూలై 19న ములుగు జిల్లా వాజేడులో కురిసిన 51.75 సెం.మీ. వాన ఇప్పటివరకు టాప్ అని.. ఇప్పుడది 3వ స్థానానికి పడిపోయిందని వివరించింది. ఇక కేవలం 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోని 35కుపైగా ప్రాంతాల్లో 20సెంటీమీటర్లకుపైన వర్షపాతం నమోదవడం కూడా రికార్డేనని తెలిపింది.
సాక్షి, హైదరాబాద్: కుండపోత, కుంభవృష్టి కాదు.. ఆకాశానికి చిల్లులు పడ్డాయేమో అనిపించేట్టుగా అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో వానలు పోటెత్తాయి. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 24 గంటల వ్యవధిలో (బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం 8.30 వరకు) ఏకంగా 64.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లపైన, మరో 200 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లపైన భారీ వర్షాలు నమోదుకావడం గమనార్హం.
ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు కుండపోత వానలతో అతలాకుతలం అయ్యాయి. ఉప నదులు, వాగులు ఉప్పొంగుతుండటం, చెరువులు, చిన్న ప్రాజెక్టులు అలుగు పారుతుండటంతో.. చాలా ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు, వంతెనలు తెగిపోయాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. భూపాలపల్లిలోని మోరంచ వాగు ఉధృతికి గ్రామం పూర్తిగా నీట మునగడంతో.. అక్కడి వారిని రక్షించడానికి హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ వానలతో గోదావరి ఉగ్రరూపం దాల్చగా.. కృష్ణా నదిలోనూ ప్రవాహం పెరుగుతోంది.
రాష్ట్రంలో 9.77 సెంటీమీటర్ల సగటు
బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.77 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. హన్మకొండ జిల్లాలో అయితే ఏకంగా 27.59 సెంటీమీటర్లు, భూపాలపల్లి జిల్లాలో 26.46, వరంగల్ జిల్లాలో 21.46, కరీంనగర్ జిల్లాలో 20.10 సెంటీమీటర్ల సగటు వర్షం పడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment