బస్సుకు వాహనాలు ఎంత దూరంలో ఉన్నాయో తెలుపుతున్న ‘ఐ–రాస్తే’
సాక్షి, హైదరాబాద్: బస్సు ప్రమాదాలను నివారించేందుకు ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. రెండు రైళ్లు ఢీ కొనకుండా కవచ్ పేరుతో రైల్వే ఇటీవలే యాంటీ కొల్యూజన్ డివైస్‌లను అమర్చే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ తరహాలోనే, బస్సుల్లో కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో యాంటీ కొల్యూజన్ సాంకేతికతను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. డ్రైవర్‌ను నిరంతరం అప్రమత్తం చేసేలా.. గచ్చిబౌలిలోని ఐఐఐటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఎస్‌ఐఆర్–సీఆర్‌ఆర్‌ఐ, ఐఎన్‌ఏఐలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘ఐ–రాస్తే’(ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్) పరిజ్ఞానాన్ని బస్సుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ పరిజ్ఞానాన్ని నాగ్‌పూర్‌లోని బస్సుల్లో ఇటీవలే ఏర్పాటు చేసి విజయవంతంగా వినియోగిస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ కూడా ఈ పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటంలో కీలకంగా వ్యవహరించిన ఐఐఐటీ నిపుణులతో ఇటీవల చర్చించారు.
ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు తిరిగే 20 అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ప్రయోగాత్మకంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత మూడు రోజులుగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పది బస్సుల్లో దీన్ని బిగించారు. వాటి పనితీరును మూడు రోజులుగా పరిశీలిస్తున్నారు. మిగతా బస్సుల్లో కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.
‘ఐ–రాస్తే’ పనిచేస్తుందిలా..
► ఈ వ్యవస్థ నిరంతరం డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంటుంది. డ్రైవర్ వద్ద ఉండే స్క్రీన్‌పై సూచనలువస్తాయి.
► అవసరమైనప్పుడు బీప్ సౌండ్ ద్వారా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. తద్వారా ముందు వెళ్లే వాహనానికి బస్సు అతి చేరువగా వెళ్లకుండా చూస్తుంది.
► ముందు వెళ్లే వాహనం నెమ్మదించినా, సడన్ బ్రేక్ వేసినా కూడా డ్రైవర్ గుర్తించేలా సిగ్నల్ ఇస్తుంది.
► రోడ్ల పరిస్థితిని కూడా డ్రైవర్‌కు తెలుపుతుంది. బస్సు రోడ్డుకు ఓ పక్కకు వెళ్లినా, రోడ్డు గతుకులుగా ఉన్నా, గోతులు చేరువవుతున్నా, మలుపులు సమీపించే ముందు డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది.
గరిష్ట స్థాయిలో ప్రమాదాల నివారణ
గత రెండుమూడు నెలలుగా ఆర్టీసీ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. రోడ్లు సరిగా లేకపోవటం, ముందు వెళ్లే వాహన డ్రైవర్ల తప్పిదాలు, ఇతర కొన్ని కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని గరిష్ట స్థాయిలో నివారించేందుకు ఈ కొత్త సాంకేతికత ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 20 బస్సుల్లో ఈ వ్యవస్థ పనితీరును అంచనా వేసి, ఆ సాంకేతికత ద్వారా డ్రైవర్‌కు అందుతున్న సూచనలు, వాటిల్లో చేయాల్సిన మార్పు చేర్పులపై మరోసారి ఐఐఐటీ నిపుణులతో చర్చించి పూర్తిస్థాయిలో ఆ సాంకేతికతను సమకూర్చుకోనున్నారు. ప్రస్తుతానికి ఆ సాంకేతికతను ఉచితంగానే సమకూరుస్తున్నా.. ప్రయోగం విజయవంతమయ్యాక అవసర మైన బస్సుల్లో దాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కొనుగోలు చేయాల్సి ఉంది. ధర విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment