సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం ఉదయం 11 గంటలకు తొలిసారిగా కొలువు దీరనుంది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం తదితరాల కోసం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగనున్నాయి.
రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం
తొలిరోజు సమావేశంలో కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమా న్ని నిర్వహించేందుకు ఏఐఎంఐఎం సీనియర్ శాసన సభ్యు డు అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నామినేట్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 8.30కు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
సీఎం ఎ.రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు ఈ కార్యక్ర మంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ప్రొటెమ్ స్పీకర్ అధ్యక్షతన తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత తెలుగు అక్షరమాలలోని అక్షర క్రమంలో ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
తొలిసారిగా అసెంబ్లీకి 51 మంది
అన్ని పార్టీల తరఫున కలుపుకుని మొ త్తం 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, కరీంనగర్ జిల్లా నుంచి 8 మంది తొలిసారిగా ఎన్నికైన వారున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు తొలిసారి అడు గు పెడుతున్నారు. 51 మందిలో 18 మంది క్రియాశీల రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తున్న వారే.
కేసీఆర్, రాజాసింగ్ దూరం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదు. బీజేపీ తరఫున ఎన్నికైన రాజాసింగ్.. ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యేను నియమించినందున తాను ఆయన ఎదుట ప్రమాణ స్వీకారం చేయబోనని ప్రకటించారు.
నేడు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్
శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత స్పీకర్ ఎన్నిక కోసం శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయన శనివారం సాయంత్రం సీఎం రేవంత్, మంత్రివర్గం సమక్షంలో నామినేషన్ సమర్పిస్తారని తెలిసింది.
కాగా రెండో రోజు ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధ్యతల స్వీకరణ కార్యక్రమం, ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఈ నెల 11న సోమవారం జరిగే మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాయిదా పడే సభ తిరిగి 12వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభమవుతుంది. నాలుగో రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.
బీఆర్‌ఎస్‌కు విపక్ష హోదా
శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులకు గాను తెలంగాణ మూడో శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేల బలం ఉంది. బీఆర్‌ఎస్ 39, బీజేపీ 8, ఏఐఎంఐఎంకు ఏడుగురు సభ్యుల బలం కలిగి ఉన్నాయి. అధికార కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్‌ఎస్‌కు విపక్ష హోదా దక్కే అవకాశముంది.
ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్
మూడో శాసనసభ తొలి సమావేశాలు శనివారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీలో అధికారులతో సమీక్ష తర్వాత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్, ఐఏఎస్ అధికారులు అశోక్‌రెడ్డి, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment