‘ఫ్లూ’ ఏదైనా.. జాగ్రత్తే అసలు మందు | Avian Flu Confirmed In 10 States | Sakshi
Sakshi News home page

‘ఫ్లూ’ ఏదైనా.. జాగ్రత్తే అసలు మందు

Published Sun, Jan 17 2021 11:10 AM | Last Updated on Sun, Jan 17 2021 12:19 PM

Avian Flu Confirmed In 10 States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బర్డ్‌ ఫ్లూ... కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో ఎదురైన మరో ఉపద్రవం. ఈ ఫ్లూ పక్షులపైనే కాదు.. మనుషులపైనా ప్రభావం చూపనుందని కేంద్ర ప్రభుత్వం పసిగట్టింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ ఛాయలను గుర్తించింది. కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లో ఈ నెల 11న ఫ్లూ ఉన్నట్లు ఖరారు చేసిన కేంద్రం... దీన్ని ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజాగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రధానంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లే బర్డ్‌ ఫ్లూపై పోరాటంలో కీలక భూమిక పోషించాలని స్పష్టం చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు అప్పగించినప్పటికీ... సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదమేమీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది. చదవండి: కోవాగ్జిన్‌ వద్దు.. కోవిషీల్డ్‌ కావాలి

పూర్తిగా ఉడికించిన ఆహారం మేలు
హాఫ్‌ బాయిల్డ్‌(సగం ఉడికించిన) గుడ్లను అస్సలు తినొద్దు. సగం ఉడికించిన చికెన్‌ జోలికీ పొవద్దు. 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కనీసం అరగంట పాటు ఉడికించిన పదార్థాలనే తినాలి. బర్డ్‌ఫ్లూ సోకిన పక్షులకు కాస్త దూరంగా ఉండటంతో పాటు అవి సంచరించిన చోట ఉండే ఆహార పదార్థాలు, పచ్చి కాయగూరలు, పండ్లను తీసుకోకపోవడమే మేలు. ఆహార పదార్థాల వాడకంపై మరింత అవగాహన పెంచుకోవాలి. దీనికి సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. (చదవండి: దేశమంతటా టీకా పండుగ)

జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు... 
బర్డ్‌ ఫ్లూపై పోరాటం చేసే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. కలెక్టర్‌ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రోజువారీ పురోగతిని సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా పశుసంవర్థక, అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూ సంస్కరణల విభాగం, హోం, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరణించిన పక్షులను ముట్టుకోకుండా ఉండటంతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొంది. అకారణంగా పక్షులు మరణించినట్లు గుర్తిస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌ నంబర్‌ 040–246511196కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది.

జ్వరం, గొంతు నొప్పి
బర్డ్‌ఫ్లూ సోకిన పక్షితోనే ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. ఫ్లూ సోకిన పక్షిని తాకడం.. ముఖ్యంగా పక్షి కళ్లు, ముక్కును పట్టుకోవడంతో ఈ వైరస్‌ మరొకరికి సోకుతుంది. ఫ్లూ సోకిన పక్షి ఎగురుతున్నప్పుడు రెక్కల ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని శాçస్త్రవేత్తలు చెబుతున్నారు. పక్షుల్లో రకరకాల లక్షణాలు అంతర్గతంగా కనిపిస్తుండగా... ఈ వైరస్‌ మనుషులకు సోకితే ముందుగా జ్వరం, గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి, కండరాలు, ఎముకల నొప్పితో మొదలై క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, గర్భిణులు, బాలింతలు, రెండేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధుల్లో ఈ వైరస్‌ సొకితే దుష్ప్రభావాలు ఎక్కువ. వీరంతా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో పొందుపర్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement