
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారవేడి క్రమంగా పెరుగుతోంది. శనివారంరాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టిన తొలిదశ ప్రజాసంగ్రామయాత్ర ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం నుంచే ప్రచారపర్వంలోకి సంజయ్, ఇతరనేతలు దిగడంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల ఉత్సాహం రెట్టింపు అయింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం కేసీఆర్ వ్యవహారశైలిని ఎండగడుతూ హుజూరాబాద్‌లో సంజయ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.
నేరుగా సీఎం కేసీఆర్‌కే సవాళ్లు విసురుతూ ఉపఎన్నికల కదనరంగాన్ని ఆసక్తిగా మార్చారు. క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా కార్యాచరణను సిద్ధం చేసుకునే ఏర్పాట్లలో పార్టీ నాయకత్వం నిమగ్నమైంది. ఆదివారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ అధికారికంగా బీజేపీ హుజూరాబాద్ ఉపఎన్నికల అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరు ప్రకటించడంతో పార్టీపరంగా ఎన్నికల ప్రచారవేగం పెంచేందుకు మరో లాంఛనం పూర్తి అయింది.
ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో ఆయా పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిశాక పల్లెపల్లెనా ప్రచారం మరింత రక్తికట్టనుంది. అన్నిపార్టీలు తమ ప్రచార వ్యూహాలకు పదునుపెడుతూ ఓటర్లను చేరుకుని మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి.