
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఇప్పటికిప్పుడు కాకుండా జనవరిలో జరిగితే పార్టీకి మరింత ప్రయోజనమని బీజేపీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ముఖ్య నేతలు ఈ అభిప్రాయంతో ఉన్నట్టు పార్టీవర్గాల సమాచారం. హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు ముగిసిన తర్వాత మునుగోడు ఉప ఎన్నిక నిర్వహిస్తే ఫలితం ఉంటుందని, అక్కడి గెలుపు ఇక్కడ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని వీరు భావిస్తున్నట్లు పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. అదే సమయంలో జాతీయ నాయకత్వంలోని కొందరు నేతలు ఈ ఎన్నిక ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తేనే మంచిదనే ఆలోచనతో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, పార్టీపరంగా చక్కదిద్దాల్సిన అంశాలు, ఈ ఎన్నిక ఆలస్యంగా జరగడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి అధినాయకత్వానికి తెలియజేస్తే మంచిదనే ఆలోచనలో రాష్ట్ర నేతలు ఉన్నారు. ఉప ఎన్నిక నిర్వహణకు వచ్చే ఫిబ్రవరి వరకు సమయముండటాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరాలని భావిస్తున్నారు.
పరిస్థితులన్నీ చక్కదిద్దుకునేలా..
మునుగోడు ఉప ఎన్నిక పురస్కరించుకుని పార్టీపరంగా బీజేపీకున్న సమన్వయ లోపాలు, లోటుపాట్లు, ఇతర సమస్యలను అధిగమించేందుకు ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అవసరమైన కార్యాచరణను వెంటనే చేపట్టాలనే ఆలోచనతో ఉన్నారు. అదే సమయంలో పార్టీకి అనుకూల వాతావరణం తీసుకొచ్చేందుకు, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వివిధ వర్గాల మద్దతు కూడగట్టి కచ్చితంగా గెలిచేలా చేసేందుకు కూడా మరికొంత సమయం అవసరమని అంచనా వేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా మారనున్న ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు అత్యంత ఆవశ్యకం కావడంతో అన్ని విధాలుగా సిద్ధమైన తర్వాతే ఎన్నిక జరిగితే బావుంటుందనేది నేతల ఆలోచనగా ఉంది.
ఇదీ చదవండి: కేడర్‌ను కదిలించేలా ‘భారత్ జోడో యాత్ర’.. టీపీసీసీ ముమ్మర కసరత్తు
Comments
Please login to add a commentAdd a comment