
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలు ప్రభుత్వాధినేతగా సీఎం ఉన్నారా? అసలు పాలన సాగుతోందా? అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. మొత్తం పాలనను పడకేసేలా ఫక్తు రాజకీయాలు చేస్తూ సీఎం.. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ టెన్త్ ప్రశ్నపత్రం లీక్ కావడం ఏంటని నిలదీశారు.
దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రప్రభుత్వం ఒక్క పరీక్ష కూడా సరిగా నిర్వహించలేని స్థితికి చేరుకున్నందున ఐటీశాఖ మంత్రికి కేబినెట్‌లో కొనసాగే నైతికహక్కు ఉందా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేటీఆర్ పొద్దున లేస్తే టెక్నాలజీ గురించి మాట్లాడతారని ఎద్దేవాచేశారు. సీఎంకు ఊర్లు తిరగడానికి సమ యం ఉంటుంది కానీ, పేపర్ లీకేజీలు, తదితర విషయాలపై సమీక్షలకు టైమ్ ఉండదా? అని నిలదీశారు. కాగా, ఈనెల 8న ప్రధాని రాష్ట్ర పర్యటనను ముఖ్యంగా సికింద్రాబాద్ బహిరంగసభను దిగ్విజయం చేయాలని పార్టీ నేతలకు లక్ష్మణ్ సూచించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మోదీ కార్యక్రమానికి పార్టీపరంగా చేయాల్సిన సన్నాహాలపై జిల్లాల పార్టీ నేతలతో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment