సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. జూలై 2, 3 తేదీల్లో నోవాటెల్ హోటల్ (హైటెక్స్ సమీపంలోని)లో కార్యవర్గ భేటీ నిర్వహించాలని జాతీయ నాయకత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే నెలలో రెండ్రోజులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 40 మంది కేంద్ర మంత్రులు, 18 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు దాదాపు 400 మంది నగరంలోనే ఉండనున్నారు.
రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి నగరంలో ఈ భేటీ జరగబోతోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2004 లోక్‌సభ ఎన్నికలకు ముందు వైస్రాయ్ హోటల్‌లో ఈ సమావేశాలు జరిగాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అనుకూల పరిస్థితులున్నాయని పార్టీ జాతీయ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కీలక సమావేశాలను నిర్వహిస్తోందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
సమావేశ స్థలాన్ని పరిశీలించిన జాతీయ నేతలు
సమావేశ స్థలం, జాతీయ కార్యవర్గసభ్యులకు బస కల్పించే నోవాటెల్, ఇతర హోటళ్లు, ప్రధాని బస నిమిత్తం రాజ్‌భవన్, తదితర ప్రదేశాలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ జీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతలు బుధవారం సందర్శించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశంలో పార్టీ నేతలు సంజయ్, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మంత్రి శ్రీనివాస్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జితేందర్ రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చాడ సురేశ్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్ తదితరులతో తరుణ్‌ఛుగ్, సంతోష్‌జీ సమావేశమయ్యారు. లోపాలు, లోటుపాట్లు లేకుండా కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. బుధవారం రాత్రి రాజ్‌భవన్‌ను సైతం సందర్శించిన తరుణ్ చుగ్, çసంతోష్‌జీ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.
రాజ్‌భవన్‌లో ప్రధాని బస
కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రధాని మోదీ రాజ్‌భవన్‌లో బస చేయనుండగా కేంద్ర మంత్రులు వివిధ స్టార్ హోటళ్లలో విడిది చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపు 500 దాకా గదులను ముందస్తుగా బుక్ చేసినట్టు సమాచారం. పెద్ద సంఖ్యలో జాతీయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా హాజరుకానుండటంతో వారికి విడిగా మీడియా సెంటర్, హోటళ్లలో బస తదితర ఏర్పాట్లలో రాష్ట్ర పార్టీ నిమగ్నమైంది.
అటు పార్టీ కార్యాచరణ.. ఇటు రాష్ట్రాల్లో ఎన్నికలపై దృష్టి..
దేశవ్యాప్తంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్రంతో సహా వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. 8 ఏళ్ల మోదీ పాలన విజయాలు, పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలు, రాష్ట్రాల్లో ప్రాంతీయ, కుటుంబ పార్టీలు అధికారంలో ఉండటంతో పెరుగుతున్న అవినీతి, నియంత పాలనను ప్రస్తావించనున్నారు. కుటుంబ పాలన ముగిసిన రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిని వివరించనున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు ఏర్పడితే లభించే ప్రయోజనాలు తెలియజేయనున్నారు. టీఆర్‌ఎస్ సర్కారు పాలన వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు సీఎం కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసి అటు పార్టీకి దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment