సాక్షి, హైదరాబాద్: బీసీ ఎజెండాతో రాష్ట్ర ఎన్నికల పోరులోకి దూకిన బీజేపీ.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ‘బీసీ గర్జన’సభ చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో మోదీకి అందుబాటులో ఉండే తేదీని బట్టి హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఈ సభ నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో 52 శాతానికిపైగా ఉన్న బీసీలు, ఎంబీసీల మద్దతు సాధించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో మోదీ సభ ద్వారా సందేశం ఇవ్వాలనే భావిస్తున్నట్టు వివరిస్తున్నాయి. ఒకవేళ మోదీ హాజరయ్యే పరిస్థితి లేకుంటే.. బదులు గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘బీసీ గర్జన’సభలో పాల్గొంటారని అంటున్నాయి. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ అంశంపై ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్, మోర్చా రాష్ట్ర నేతలు పాల్గొని చర్చించినట్టు తెలిసింది.
ఆరు సభలకు మోదీ..
వచ్చేనెల 3న నామినేషన్ల దాఖలు ప్రారంభమై 28న ప్రచారపర్వం ముగిసేలోగా మొత్తం ఆరు సభల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ల పరిధిలో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. మిగతా జిల్లాలనూ కవర్ చేస్తూ చివరగా హైదరాబాద్‌లో భారీ సభతో తన కార్యక్రమాలను ముగించనున్నారు.
మరోవైపు ఇదే సమయంలో పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీనడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాలు సీఎంలు, ఇతర ముఖ్యనేతలు విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు. వచ్చేనెల 3 నుంచి పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమాల్లోనూ కేంద్ర మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తంగా రోజూ కనీసం ఒకటి, రెండు సభలు, రోడ్ షోలు ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment