సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ లేదా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బహిరంగ సభ జరిగే అవకాశాలున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వారు నగరానికి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జూలై 2న ఎల్‌బీ స్టేడియంలో సభ నిర్వహించేందుకు రాష్ట్ర పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
సాధారణంగా జాతీయ కార్యవర్గ భేటీ జరిగే ప్రాంతంలో రాష్ట్ర పార్టీ నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని, పార్టీ అగ్రనేతలు పాల్గొనడం ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని హైదరాబాద్‌లోనూ కొనసాగించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతి సాధించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వచ్చే నెల 2, 3 తేదీల్లో నోవాటెల్‌లో ‘బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ’ జరగనుంది. 1వ తేదీన జాతీయ పదాధికారుల సమావేశంలో ఎగ్జిక్యూటివ్ భేటీ ఎజెండాను ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30నే బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నగరానికి చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.
మోదీకి అపూర్వ స్వాగతం...
ఇదిలా ఉండగా.. మోదీ, అమిత్‌షా జూలై 2, 3 తేదీల్లో నగరంలోనే ఉంటారు. 2న బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకునే మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ ఓపెన్ టాప్ జీప్‌లో లేదా ప్రధాని వాహన శ్రేణి నుంచే కార్యకర్తలు, ప్రజలకు అభివాదం పలుకుతూ ముందుకు సాగేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
బేగంపేట్ నుంచి మోదీ బసచేసే రాజ్‌భవన్ దాకా, రాజ్‌భవన్ నుంచి నోవాటెల్ వరకు రోడ్డుకు ఇరువైపులా పార్టీ నాయకులు, కార్యకర్తల జయజయధ్వానాలతోపూలవర్షం కురిపిస్తూ జాతీయ కార్యవర్గ భేటీ సన్నాహక సమావేశాల్లో భాగంగా శుక్రవారం రాత్రి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, ఇతర ముఖ్యనేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు.
లక్ష్మణ్‌కు బండి సంజయ్ అభినందనలు
ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుభాభినందనలు తెలిపారు. విద్యార్థి దశ నుంచే గొప్ప నాయకుడిగా ఎదిగిన లక్ష్మణ్ రాజ్యసభలో తెలంగాణ గళాన్ని వినిపిస్తారని విశ్వసిస్తున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో చెప్పారు.
బీజేపీలో కష్టపడిన వారికే పదవులు దక్కుతాయనడానికి డా‘‘లక్ష్మణ్ మరో ఉదాహరణ’అని సంజయ్ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తరువాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న లక్ష్మణ్‌కు శనివారం నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment