సాక్షి, హైదరాబాద్: బీజేపీ దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ విస్తారక్‌ల శిక్షణశిబిరాన్ని మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న ఈ శిక్షణాశిబిరానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణకు హాజరవ్వాలంటూ సంతోష్‌కు సిట్ నోటీసులు జారీ, దానిపై హైకోర్టు స్టే తదితర పరిణామాల నేపథ్యంలోఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఒకటిన్నర రోజుల్లో అంటే 29వ తేదీ మధ్యాహ్నంకల్లా ఈ శిబిరం ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తెలంగాణలోని అసెంబ్లీ విస్తారక్‌లు, ఇన్‌చార్జీలతోనూ సంతోష్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వచ్చేఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీని అన్నిస్థాయిల్లో పటిష్టం చేయడంపై దిశానిర్దేశనం చేయనున్నారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ కమిటీల నియామకం పూర్తి చేయడంతోపాటు రాష్ట్రంలోని అన్ని మండలస్థాయి కమిటీల ఏర్పాటు, సంస్థాగతంగా పార్టీ పటిష్టతపై చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై దృష్టి నిలపనున్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జీలకు ప్రత్యేకంగా ఈ శిక్షణకార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇతర ప్రాంతాలకు సంబంధించిన లోక్‌సభ విస్తారక్‌ల శిబిరాలు ఇప్పటికే ముగిశాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 160 నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపునకు బాటలు వేసేందుకు ఏమి చేయాలన్న దానిపై ఈ శిబిరాల్లో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బీజేపీ ఇంతవరకు గెలుపొందని లేదా రెండోస్థానంలో ఉన్న ఎంపీ స్థానాలు, దక్షిణాదిలోనే అధికంగా ఉండటంతో వీటిపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment