First Dose Of Covid Vaccine Break In Telangana Due To Shortage - Sakshi
Sakshi News home page

Vaccination In Telangana: మరో వారం రెండో డోసే

Published Fri, May 7 2021 5:40 PM | Last Updated on Sat, May 8 2021 3:01 PM

Break For First Dose Vaccination In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా శనివారం నుంచి రెండో డోసు వేసుకునే లబ్ధిదారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రెండో డోసు వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో పూర్తిస్థాయి ప్రతిరక్షకాల అభివృద్ధికి ఆస్కారం ఉంటుందన్నారు. శుక్రవారం వైద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డితో కలసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మరో వారంలోగా రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన వారు 5 లక్షల మంది ఉన్నారని, ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖ వద్ద 3.75 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వచ్చే వారం నాటికి రెండో డోసుకు 1.25 లక్షల టీకాల కొరత ఉంటుందని, రెండో డోసుకు నిల్వలు నిండుకోవడంతో తొలి డోసు వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ వేసినట్లు చెప్పారు.

టీకాల నిల్వలను బట్టి తొలిడోసు వ్యాక్సినేషన్‌ పంపిణీపై ప్రకటన చేస్తామని చెప్పారు. ఈనెల 15 నాటికి మరో 3 లక్షల టీకాలు రాష్ట్రానికి చేరుకుంటాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో రోజుకి 2 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చే సామర్థ్యం ఉందని, నిల్వలు తక్కువగా ఉండటంతోనే ఇబ్బందులు తలెత్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కరోనా పరిస్ధితిపై సుదీర్ఘంగా చర్చించారని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్‌–19 పాజిటివ్‌ రేటు తగ్గిందని, మరో వారంలో కేసుల సంఖ్య మరింత తగ్గుముఖం పడుతుందన్నారు. ఇకపై కోవిడ్‌ బులెటిన్‌ ప్రతీరోజు సాయంత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు.

నగరంలో అదనంగా బెడ్స్‌..
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆస్పత్రుల్లో బెడ్ల పెంపు ప్రక్రియ కొనసాగుతోందని డీఎంఈ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఒక్కో ఆస్పత్రిలో కనీసం 100 బెడ్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టిమ్స్‌లో మరో 200 బెడ్లు పెంచుతున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్‌ కేటాయించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు నిర్దేశించిన కోటా ఇవ్వకపోవడంతో సమస్యలు వస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో రోజురోజుకూ ఆక్సిజన్‌ ఆవశ్యకత పెరుగుతోందని, అందుకే ఆక్సిజన్‌ జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 51 ఆక్సిజన్‌ జెనరేటర్లు ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు కాస్త ఉపశమనం కలుగుతుందన్నారు.

స్లాట్‌ బుకింగ్‌లన్నీ రద్దు..!
తొలివిడత వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడటంతో ఈనెల 14 వరకు వ్యాక్సిన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్న వాటన్నింటినీ వైద్య, ఆరోగ్య శాఖ రద్దు చేసింది. ఈ మేరకు లబ్ధిదారుల ఫోన్‌కు సంక్షిప్త సమాచారాన్ని పంపింది. అయితే తొలిడోసు మాత్రమే కాకుండా రెండో డోసు కోసం బుక్‌ చేసుకున్న స్లాట్‌లను సైతం వైద్య, ఆరోగ్య శాఖ రద్దు చేయడం గమనార్హం. అయితే రెండో డోసుకు సమయం వచ్చిన వాళ్లు నేరుగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వెళ్తే అక్కడ వివరాలు నమోదు చేసుకుని టీకాలు ఇస్తామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

కోవిన్‌ యాప్‌లో మార్పులు చేయాలని కోరాం: శ్రీనివాసరావు
ప్రస్తుతం కోవిన్‌ యాప్‌లో మొదటి, రెండో డోసు అన్న తేడా లేకుండా అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉన్నందున, యాప్‌లో మార్పులు చేయాలని కేంద్రాన్ని కూడా కోరినట్లు రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు. శనివారం నుంచి రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న అడ్వాన్స్‌ బుకింగ్‌తో సంబంధం లేకుండా సమీపంలోని వ్యాక్సిన్‌ కేంద్రాలకు వచ్చి వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని వివరించారు. రాష్ట్రంలో రెమిడెసివర్‌ ఇంజెక్షన్లకు కొరత రానీయకుండా చూసుకుంటున్నామని, ఇప్పటికే రాష్ట్రం నాలుగున్నర లక్షల ఇంజెన్షన్లకు ఆర్డర్‌ ఇచ్చిందని చెప్పారు. టొసిలిజుమాబ్‌ ఇంజెక్షన్‌ మరీ సీరియస్‌ కండీషన్‌లో ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని, అవసరం లేకుండా ఇస్తే.. బాధితుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రమేశ్‌ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన మొత్తం ప్రజలు(18+వయసున్న వారు) : 3 కోట్ల మంది
మొత్తం ఎన్ని కోట్ల డోసులు కావాలి : 6 కోట్ల డోసులు
ఇప్పటివరకు ఇచ్చిన వ్యాక్సిన్‌ డోసులు: 50 లక్షలు
మొదటి డోసు తీసుకున్న వారు    : 40 లక్షలు
రెండో డోసు తీసుకున్న వారు: 10 లక్షలు
రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ బెడ్స్‌ సంఖ్య (అన్ని కలిపి): 53,528
భర్తీ అయిన బెడ్స్‌    : 28,170
ఖాళీగా ఉన్న బెడ్స్‌: 25, 358 
ఆక్సిజన్‌ బెడ్స్‌(ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి): 14,032
కోవిడ్‌ బాధితులతో భర్తీ అయినవి: 6,484
ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో బెడ్స్‌: 11,194
ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్స్‌లో భర్తీ అయిన బెడ్స్‌: 8,271  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement