‘టెస్టింగ్.. ట్రేసింగ్.. ట్రీట్‌మెంట్.. కరోనా పరిభాషలో ఈ మూడు ‘టీ’లు కీలకం. కానీ.. నగరంలో ఇవే కొంప ముంచే దుస్థితి నెలకొంది. తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచిందన్న చందంగా మారింది. కోవిడ్‌ను నిలువరించేందుకు వ్యాక్సినేషన్ కోసం వెళితే మొదటికే ముప్పు వాటిల్లుతోంది. టీకా వేయించుకునేందుకు పోతే వైరస్ సోకుతోంది. కేంద్రాలకు వచ్చేవారిలో ఎవరు పాజిటివో.. ఎవరు నెగెటివో తెలియడంలేదు. గుంపులు గుంపులు రావడం, మాస్కులు ధరించకపోవడం.. తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఒకరి నుంచి మరొకరికి కరోనా విస్తరిస్తోంది’
దిల్‌సుక్‌నగర్‌కు చెందిన కమల్‌కిశోర్ ఈ నెల 8న సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో టీకా వేయించుకున్నారు. ఆ తర్వాత 3 రోజులకే ఆయనకు జ్వరం ఒంటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అనుమానం వచ్చి టెస్ట్ చేయించడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిజానికి ఆయన వాక్సిన్ తీసుకోవడానికి ముందు కానీ తీసుకున్న తర్వాత కానీ బయటికి వెళ్లలేదు. మరి వైరస్ ఎలా సోకిందని ఆరా తీయగా.. టీకా వేయించుకున్న ప్రదేశం నుంచేనని తేలింది. టెస్టులకు వచ్చిన వారు, టీకా వేయించుకోవడానికి వచ్చిన వారు ఒకేచోట కలవడంతో వైరస్ సోకినట్టు వెల్లడైంది.
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ నగరవాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు వైరస్ బారిన పడుతుండటంతో నిర్ధారణ టెస్టుల కోసం సమీపంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. వైరస్‌ను కట్టడి చేయాల్సిన ఆరోగ్య కేంద్రాలు.. మరింత విస్తరణకు కారణమవుతున్నాయి. ఒకే ప్రాంగణంలో టెస్టులు.. టీకాలు కొనసాగుతుండటంతో కోవిడ్ బాధితులు, లబ్ధిదారులతో రద్దీగా మారుతున్నాయి.
టెస్టుల కోసం సరైన గదులు లేకపోవడంతో ల్యాబ్ టెక్నిషియన్లు పీపీఈ కిట్లతో చెట్లకిందే నిల్చుని పరీక్షలు చేయాల్సివస్తోంది. రోగుల నిష్పత్తికి తగినన్ని కిట్లు సరఫరా చేయకపోవడంతో సమస్య తలెత్తుతోంది. టెస్టుల కోసం ఉదయం 8 గంటలకే ఆస్పత్రికి చేరుకుని గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడినవారు తీరా కిట్లు లేక చివరకు వైద్యసిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. కమ్యూనిటీ హాళ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటిని టీకాల కోసం వినియోగిస్తే లబ్ధిదారులు వైరస్ బారిన పడకుండా చూడొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అటు కిట్లు.. ఇటు టీకాల కొరత..
► హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 248 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తుండగా, ఒక్కో సెంటర్‌లో రోజుకు వంద మందికి టెస్టులు చేస్తున్నారు. వీరికి సహాయంగా కుటుంబ సభ్యులు కూడా వస్తుండటంతో ఆయా కేంద్రాలన్నీ రద్దీగా మారుతున్నాయి. వచ్చిన వారిలో ఎవరికి వైరస్ ఉందో తెలియని దుస్థితి. భౌతికదూరం పాటించడం లేదు. శానిటైజ్ చేయని కుర్చీల్లోనే ఒకరి తర్వాత మరొకరు కూర్చుంటున్నారు. చెట్ల కింద గుంపులుగా నిలబడుతుండటం, టెస్టులు, టీకాలు ఒకే చోట నిర్వహిస్తుండటం వైరస్ విస్తరణకు కారణమవుతోంది. ఫలితంగా నెలవారీ పరీక్షలకు వస్తున్న గర్భిణులు, బాలింతలు, శిశువులు వైరస్ బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
► ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 179 ప్రభుత్వ, 148 ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ టీకాలు వేస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో రోజుకు సగటున 150 మందికి టీకా వేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ఈ మూడు జిల్లాల్లో సుమారు 20 లక్షల మందికి టీకాలు వేశారు. మొదట్లో టీకాపై పెద్దగా ఆసక్తి చూపని సిటిజన్లు..సెకండ్‌వేవ్ తీవ్రత కారణంగా తాజాగా టీకాల కోసం క్యూ కడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న టీకాల నిష్పత్తికి మించి లబ్ధిదారులు వస్తుండటంతో కోవిన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి కూడా టీకాలు దొరకని పరిస్థితి. అంతేకాదు తొలి విడతలో టీకా వేయించుకున్న వారు రెండో డోసు కోసం పడిగాపులు కాస్తున్నారు.
టీకా కోసం వెళ్తే వైరస్
కోవిడ్ టీకా వేయించుకునేందుకు ఈ నెల 4న బాలానగర్ పీహెచ్‌సీకి వెళ్లాను. నాతో పాటు నా భార్యను కూడా తీసుకెళ్లాను. అప్పటికే అక్కడ టెస్టుల కోసం వచ్చిన వారితో ఆస్పత్రి రద్దీగా మారింది. టెస్టుల కోసం వచ్చిన వారి మధ్యలో నుంచి టీకా గదిలోకి వెళ్లాల్సి వచ్చింది. టీకా వేయించుకున్న నాలుగు రోజులకే నా భార్యకు దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు మొదలయ్యాయి. టెస్ట్ చేయిస్తే పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్పటికే ఆమెకు సన్నిహితంగా మెలిగిన నాకు కూడా వైరస్ సోకింది. నిజానికి గత నెల రోజుల నుంచి ఇద్దరం ఇంటి గడప కూడా దాటలేదు. కేవలం టీకా కోసం మాత్రమే బయటికి వెళ్లి వచ్చాం.
-జగదీశ్వర్, బడంగ్‌పేట్
సెకండ్ డోస్ దొరకడం లేదు
మార్చి 10 తేదీన సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో తొలి డోసులో భాగంగా కోవాగ్జిన్ టీకా తీసుకున్నా. రెండో డోసు కోసం ఇటీవల మళ్లీ అదే ఆస్పత్రికి వెళ్లాను. తీరా టీకా లేదన్నారు. తొలి డోసు టీకా వేసుకుని ఇప్పటికే 35 రోజులైంది. ప్రతి రోజు ఉదయమే ఆస్పత్రి వెళ్లడం.. నిరాశతో వెనుతిరిగి వస్తున్నా. ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు.
-నాగేశ్వర్‌రావు, సనత్‌నగర్
ఇది ఉప్పల్ పట్టణ ఆరోగ్య కేంద్రం. ఇక్కడ ఓవైపు కోవిడ్ టెస్టులు.. మరోవైపు టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఇంకోవైపు నెలవారీ చెకప్‌ల కోసం గర్భిణులు, బాలింతలు ఇక్కడికే వస్తున్నారు. ఉదయం 9 గంటలకే టెస్టులు, టీకాలు కొనసాగుతుండటంతో బాధితులు, లబ్ధిదారులు ఓ గంట ముందే వచ్చి ఆస్పత్రిలోని చెట్ల కింద గుంపులుగా నిల్చుంటున్నారు. వైరస్ నిర్ధారణ టెస్టుల కోసం వచ్చినవారి ద్వారా టీకాలు వేయించుకునే వారు, ఇతర వైద్య పరీక్షలకు వచ్చేవారు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది .. ఇది ఒక్క ఉప్పల్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో మాత్రమే కాదు.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని దాదాపు అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
హయత్‌నగర్‌లో టీకాల కొరత..
హయత్‌నగర్: కోవిడ్ వ్యాక్సిన్లకు డిమాండ్ పెరగడంతో ఆస్పత్రుల్లో వీటికి కొరత ఏర్పడింది. టీకాల నిష్పత్తికి మించి లబ్ధిదారులు రావడంతో గందరగోళ పరిస్థితి తలెత్తింది. చివరకు టీకాల కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. హయత్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం వరకు టీకాల పంపిణీ సజావుగానే సాగింది. గురువారం టీకాలు సరఫరా లేకపోవడంతో టీకాల కార్యక్రమాన్ని నిలిపివేశారు. వచ్చిన వారు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment