ఎన్నికల కోడ్‌.. 50 వేల ఉద్యోగాల భర్తీ ఎలా? | Break For Job Notifications In Telangana With MLC Elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోడ్‌.. 50 వేల ఉద్యోగాల భర్తీ ఎలా?

Published Mon, Feb 15 2021 1:52 AM | Last Updated on Mon, Feb 15 2021 1:56 PM

Break For Job Notifications In Telangana With MLC Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలో జరగనున్న పలు ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను ఎలా భర్తీ చేయాలన్న విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. మార్చి 14న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్‌తోపాటు కోడ్‌ అమల్లోకి రాగా ఆ వెంటనే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు రెండు, మూడు నెలలు ఆలస్యం తప్ప దని అధికారులు పేర్కొంటు న్నారు.

దీనికితోడు త్వరలో జరగాల్సిన మున్సిపల్‌ ఎన్ని కలకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడితే ఉద్యోగ నోటి ఫికేషన్ల కోసం నిరుద్యోగులు నాలుగైదు నెలల వరకు వేచి చూడకతప్పని పరిస్థితి ఉంటుందని చెబు తున్నారు. అలాగే అన్ని శాఖల్లో పదోన్నతులు పూర్తి చేశాకే ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటే మరిన్ని ఎక్కువ పోస్టులు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కిందకు వస్తాయని తాజాగా ఉన్నతాధికారులు చెప్పడంతో ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇంకా ఎక్కువ సమయమే పట్టే పరిస్థితి నెలకొంది.

అర్థిక శాఖకు అందిన వివరాలు..
రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ డిసెంబర్‌లో ఆదేశించగా ఆర్థిక శాఖ ఆ మేరకు కసరత్తు చేపట్టింది. వివిధ శాఖలు, జిల్లాలవారీగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించింది. దీని ప్రకారం పోలీసు శాఖ 20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపించింది. అందులో 450 ఎస్‌ఐ, మిగతావి కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది.

మరోవైపు విద్యాశాఖ కూడా టీచర్‌ పోస్టుల ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపించింది. 6,500 వరకు సెకండరీ గ్రేట్‌ టీచర్, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలను ఇచ్చింది. అవి కాకుండా మోడల్‌ స్కూళ్లు, విద్యాశాఖ గురుకులాల్లో మరో 1500కు పైగా ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను పంపించింది.  చదవండి: (ఆర్‌ఆర్‌ఆర్‌.. రూ.13 వేల కోట్ల భారీ వ్యయంతో ప్రాజెక్టు) 

ఇక సంక్షేమ శాఖల్లో వార్డెన్లు, వెల్ఫేర్‌ ఆఫీసర్లు, జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్లు ఇలా మొత్తంగా 1,700 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను పంచించింది. అలాగే ఆయా శాఖల పరిధిలోని కొత్త గురుకులాల్లో 3,200 వరకు బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చి ప్రతిపాదనలను పంపించాయి. ఇక వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ తదితర 3,298 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని వివరాలను అందజేసింది. మున్సిపల్‌ శాఖలోనూ 3,878 ఖాళీలు ఉన్నట్లు ఆర్థికశాఖకు పంపించింది. అలాగే రెవెన్యూ, పంచాయతీరాజ్, తదితర శాఖల్లో మొత్తంగా 50 వేల వరకు పోస్టులకు అనుమతి కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి.

అనుమతుల జారీ ప్రారంభం కాకముందే...
శాఖల వారీగా అందిన ఉద్యోగ ఖాళీల పరిశీలన ప్రక్రియను ఆర్థిక శాఖ చేపట్టింది. అది పూర్తి కాకముందే ఈ నెల 16న హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్, వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. అదే రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ మార్చి 17 వరకు అది అమల్లో ఉండనుంది. అప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయడానికి వీల్లేదు. అయితే ఈ సమయంలో ఇంటర్నల్‌ ప్రాసెస్‌ మొత్తం పూర్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. శాఖల వారీగా, పోస్టులవారీగా రోస్టర్‌ వివరాలను రూపొందించడం వంటి పనులను పూర్తి చేసుకొని నోటిఫికేషన్ల జారీకి సిద్ధం కావచ్చని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు.

వెంటవెంటనే ఎన్నికలు...
ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెనువెంటనే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ కనుక వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి మరో రెండు నెలల సమయం పట్టవచ్చని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్, సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్తే నాలుగైదు నెలలపాటు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు వేచి చూడక తప్పనిపరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేశాకే నోటిఫికేషన్ల జారీకి వెళితే ఎక్కువ మొత్తంగా ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. ఉదాహరణకు విద్యాశాఖలో ప్రస్తుతం 4 వేల వరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్లను (ఎస్‌జీటీ) భర్తీ చేయవచ్చు.

మరోవైపు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో 70 శాతం ఖాళీలను పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంది. ఇలా 6,627 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో ఎస్‌జీటీలకు పదోన్నతులు ఇస్తే మరో 6,627 ఎస్‌జీటీ పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా చేయవచ్చని చెబుతున్నారు. అలాగే హెడ్‌మాస్టర్, పీజీటీ, టీజీటీ పోస్టులను, ఇలా అవకాశం ఉన్న అన్ని శాఖల్లో పదోన్నతుల తరువాత భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఆరేడు నెలలు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.  చదవండి: (ఎక్కడా ఆంక్షల్లేవు.. మరి ప్యాసింజర్‌కు రైళ్లేవి?) 

టీచర్‌ పోస్టులైతే మరింత ఆలస్యం...
విద్యాశాఖలో ఇంతవరకు పదోన్నతుల ప్రక్రియ చేపట్టలేదు. పదోన్నతుల కోసం విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. కానీ ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా ఎన్నికల కోడ్‌ వచ్చేసింది. విద్యాశాఖతోపాటు ఏ శాఖలోనూ ఇపుడు పదోన్నతులు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎన్నికల కోడ్‌ ముగిశాకే చర్యలు చేపట్టాల్సి వస్తుంది.

మరోవైపు టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం టెట్‌ కోసం 5 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అది నిర్వహించకుండా టీచర్‌ పోస్టులను భర్తీ చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మిగితా పోస్టుల నోటిఫికేషన్ల కంటే టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ మరింత ఆలస్యం కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement