సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణ రావు. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు సోమవారం రాజ్ భవన్‌కు చేరుకొని గవర్నర్‌ను కలిసి ఆహ్వానించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసైతో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్‌రావు భేటీ అయ్యారు.
కాగా గవర్నర్ తమిళిసై విషయంలో తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. గవర్నర్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ తరఫు లాయర్ దుశ్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్‌ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు.
సాధారణంగా రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందుకు విరుద్ధంగా గతేడాది బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో బడ్జెట్ ప్రతిపాదనలను తక్షణమే సిఫారసు చేయకుండా గవర్నర్ పెండింగ్‌లో ఉంచినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment