విద్యార్థులు లేరనే సాకుతో సర్కారు కుట్ర
2.5 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరం
టీచర్ల నియామకం సహా అన్నింటా విఫలం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యను నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చదువుకు దూరం చేస్తోందని భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరనే సాకుతో ఈ ఏడాది 1,864 పాఠశాలలను మూసివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకుండా మూసివేయాలని చూడటం సిగ్గుచేటు అని విమర్శించారు. విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే 2024– 25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 2.4 లక్షలు తగ్గడం ప్రమాదకర సంకేతమని పేర్కొన్నారు.
ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని, విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో సమీక్ష చేయకుండా ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని నిందించారు. సీఎం రేవంత్‌రెడ్డికి విద్యా వ్యవస్థపై ఏమాత్రం పట్టింపు లేకపోవడం దారుణమని కేటీఆర్ విమర్శించారు .
25వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 25 వేల ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం, స్కూళ్లల్లో మౌలిక వసతుల లేమి, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం, పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో అపరిశుభ్రత, భద్రత లేకపోవడం.. వెరసి ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గడం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపై సూచనల కోసం విద్యావేత్తలు, మంత్రులతో కమిటీ వేయాలని సూచించారు. విద్యారంగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టకపోతే బీఆర్‌ఎస్ ఉద్యమిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment