సాక్షి హైదరాబాద్: సుభాష్ అర్జంట్ పనిమీద కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు. అంతలో ఫోన్ రావడంతో ఎవరో అని లిఫ్ట్ చేశాడు. సార్.. అంటూ ఓ యువతి గొంతు అవతలినుంచి పలకరించింది. తెలిసిన వాళ్లేమో అని సమాధానమిస్తే.. నగర శివారులో ప్లాట్లు ఉన్నాయి.. తక్కువ ధరకు కొనుగోలు చేస్తారా అని అంటోంది. అసలే చీకాకులో ఉన్న అతను ఫోన్ కట్ చేశాడు. ఇలాంటి ఫోన్లు ఒక్క సుభాష్‌కే కాదు.. నగరంలో దాదాపు ప్రతి ఒక్కరినీ పలకరిస్తాయి. ఎందుకంటే షాపింగ్ చేసినపుడు ఫోన్ నెంబర్ ఇస్తాం కాబట్టి..
నగర జీవితం ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు బిజీగా ఉంటుంది. దీంతో పాటు ఫోన్ కూడా మనతోపాటు బిజీ అయిపోయింది. ఎప్పుడు.. ఎక్కడ ఉన్నా మొబైల్ ఉండాల్సిందే. కాల్స్ వస్తూనే ఉంటాయి. మనం మాట్లాడుతూనే ఉంటాం. అయితే ఇటీవల టెలీకాలర్ల నుంచి ఫోన్లు ఎక్కువగా రావడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. సార్.. అంటూ తీయటి గొంతుతో మాట్లాడటం.. సమయం వృథాచేయడం.. లోన్..క్రెడిట్‌కార్డ్ అంటూ మాట్లాడుతున్నారు. ఎక్కువగా యువతులే ఫోన్లు చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ కంపెనీ, వివిధ బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు.. మార్కెటింగ్ సంస్థల నుంచి కాల్స్ వస్తున్నాయి. వ్యక్తిగత రుణం కావాలా?
క్రెడిట్ కార్డు కావాలా..సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌లో మంచి ఆఫర్లు ఉన్నాయంటూ ఫోన్ కంపెనీల వారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్స్‌కు టిప్స్ చెబుతామంటూ కొందరు, నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలో వెంచర్ ఉందని, ప్లాట్ బుక్ చేసుకోమని ఇంకొందరు నిత్యం ఫోన్ చేస్తూనే ఉంటారు.
కొత్త సిమ్ తీసుకున్నా...
మార్కెటింగ్ కాల్స్‌కు తోడు నకిలీలు కూడా పుట్టుకొస్తున్నారు. బ్యాంకింగ్, సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వ్యక్తిగత రుణాల పేరిట జరుగుతున్న మోసాల గురించి తెలియని విషయం కాదు. ఇలాంటి వారి వేధింపులు భరించ లేక చాలామంది ఫోన్ నంబర్లు మార్చుతున్నారు. ఆ నంబర్లను కూడా టెలీకాలర్స్ సేకరంచి ఫోన్ చేస్తున్నారు. వారు అందరి ఫోన్ నంబర్లు ఎలా సేకరిస్తున్నారని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సెల్‌ఫోన్ కంపెనీలతోపాటు పలు మార్గాల ద్వారా ఫోన్ నంబర్లు సేకరిస్తున్నట్లు తెలిసింది. సాధారణ ప్రజల నుంచి పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల ఫోన్ నంబర్లను సైతం సేకరించి కాల్ చేస్తున్నారు.
ఎప్పుడు పడితే అప్పుడు
ముందే కరోనా కాలం జనం ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. దీనికి తోడు అ వస్తువు కొనండి మంచి ఆఫర్ ఉంది. మీరు మా సంస్థలో పెట్టుబడి పెడితే అత్యధికంగా వడ్డీ లభిస్తుంది. అని కాల్స్‌తో ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి కాల్స్ వస్తున్నాయని పలువురు చెబుతున్నారు. నిరంతరం కాల్స్ రావడంతో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడ్డుకట్ట ఎలా?
ఇలా అడ్డూ అదుపు లేకుండా కాల్స్ వస్తుంటే.. ఏం చేయాలో దిక్కుతోచక మొబైల్ యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాక..ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఇటువంటి కాల్స్‌పై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని యూజర్లు కోరుతున్నారు.
బ్లాక్ చేసినా...
ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశాల మేరకు మార్కెటింగ్ కాల్స్ వద్దనుకునే వారు డీఎన్‌డీ (డూనాట్ డిస్టర్బ్) ఆప్షన్ ఎంచుకునే వారు. అప్పట్లో మార్కెటింగ్ నంబర్లు వేరుగా కనిపించేవి. డీఎన్‌డీ ఎంచుకున్న తర్వాత కూడా టెలీకాలర్స్ మార్కెటింగ్ నంబర్స్ నుంచి కాకుండా వేరే ఫోన్ నంబర్ల నుంచి కాల్ చేసి వేధిస్తున్నారు. తరచూ ఫోన్లు వస్తున్నాయని ఆ నంబర్‌ను బ్లాక్ చేస్తే మరో నంబర్ నుంచి కాల్ చేస్తున్నారు. బ్లాక్ అయిన ఫోన్ నెంబర్లు స్పామ్ (రెడ్ కలర్)లో కనిపిస్తాయి.
నంబర్స్ ఎక్కడ నుంచి సేకరిస్తున్నారంటే..
మనం రోజుల వారి షాపింగ్, ఆసుపత్రులకు, మెడికల్ షాపుల్లో కొనుగోలుచేస్తుంటాం. అప్పుడు బిల్లింగ్ సమయంలో మీ ఫోన్ నంబర్ అడిగి తీసుకుంటారు. ఇలా మనం తెలుసో తెలియకో మన నంబర్ చెబుతాం.ఫోన్ నంబర్ ఇవ్వలేమని చెబితే మీ వస్తువులు బిల్ చేయాలంటే సిస్టమ్‌లో నంబర్ ఎంటర్ చేయాలని, లేకపోతే బిల్ వీలుకాదని సమాధానం ఇస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ నంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా మీ నంబర్ ఇతరులకు వెళ్లిపోతుంది. పలు వ్యాపార సంస్థలు నెంబర్లు ఆయా మాల్స్,వ్యాపార సంస్థల నుంచి సేకరిస్తాయి. పలు సందర్భాల్లో మీకు ఫోన్ చేస్తున్న వ్యక్తి మీ వృత్తి, ఉద్యోగం గురించి కూడా చెబుతాడు. అంటే మీరు షాపింగ్ సమయంలో ఆ వివరాలు రాసిచ్చారన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment