సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టుకు మరో 10 మంది నూతన న్యాయమూర్తులు రానున్నారు. వీరి నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం ఆమోదించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి రాజేందర్ కశ్యప్ నోటిఫికేషన్ జారీచేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ బుధవారం లేదా గురువారం వీరితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది.
కొత్త జడ్జీలుగా నియమితులైన వారిలో న్యాయవాదులు కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదేవి, నట్చరాజు శ్రావణ్‌కుమార్ వెంకట్‌తోపాటు జిల్లా న్యాయమూర్తుల కోటా నుంచి పదో న్నతి పొందిన గున్ను అనుపమ చక్రవర్తి, మాటూరి గిరిజ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, అనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్ దేవరాజు నాగార్జున ఉన్నారు.
ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య సీజేతో కలిపి 19 ఉండగా... నూతన న్యాయమూర్తులతో ఈ సంఖ్య 29కి చేరనుంది. ఇదిలా ఉండగా, హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు పెంచుతూ గతంలో కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నేపథ్యంలో మరో 13 న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. కాగా, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన వారిలో మరో ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించలేదు.
Comments
Please login to add a commentAdd a comment