సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రయాణంలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరకడం అరుదు. అలాంటి ఓ వస్తువును రైల్వే అధికారులు స్వయంగా ఇంటికే వచ్చి బాధితులకు అప్పగిస్తే..! పైగా, అది ఓ చిన్నారికి ఎంతో ఇష్టమైన బొమ్మ అయితే...! ఆ బొమ్మను తిరిగి పొందిన ఆ చిన్నారి ఆనందానికి అవధులు ఉంటాయా..? ఉండవనే చెప్పవచ్చు. సికింద్రాబాద్ నుంచి అగర్తలాకు (07030) వెళ్లే రైలులో ఈ నెల 4న ప్రయాణం చేస్తున్న భూసిన్ పట్నాయక్ అనే ప్రయాణికుడి ఎదురు సీట్లో ఉన్న ఓ చిన్నారి తనకు ఎంతో ఇష్టమైన బొమ్మను పోగొట్టుకొంది.
దాని కోసం దిగాలుగా ఏడుస్తున్న ఆ చిన్నారికి ఎలాగైనా దానిని అందించాలనే ఉద్దేశంతో భూసిన్ రైల్వే మదద్ యాప్ ద్వారా 139 నంబర్‌కు ఫోన్ చేసి విషయాన్ని చేరవేశారు. దీంతో రైల్వే అధికారులు ఆ చిన్నారి వివరాలను సికింద్రాబాద్ రైల్వే కౌంటర్ ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో రైల్వే శాఖ సిబ్బంది ఆ బొమ్మ ఆచూకీ కోసం ఆరా తీసి, న్యూ జల్ఫాయ్‌గురి స్టేషన్ దగ్గర్లో ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా అలియాబరి స్టేషన్‌కు 20 కిలోమీటర్‌ల దూరంలో ఉన్న ఆ చిన్నారి తల్లిదండ్రులు మోహిత్, నస్రీన్ బేగంలను కలిసి ఆ బొమ్మను అప్పగించారు. ఈ సందర్భంగా రైల్వేమంత్రికి, అధికారులు, సిబ్బందికి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment