నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి జాతి సంపదలు.. విరిసివిరియని కుసుమాలు.. సరైన విద్యతో మాత్ర మే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చు. సుసంపన్నమైన దేశం కోసం.. సిద్ధమవుతున్న నేటి ఆణిముత్యాలే రేపటి మన జాతి రత్నాలు. తల్లిదండ్రుల కలల ప్రతిరూపాలు.. భావి భారత పౌరులు. పాలబుగ్గల నవ్వులు, అపురూపమైన క్షణాలు.. మరపురాని జ్ఞాపకాలు.. బాల్యం ఒక వరం. పిల్లలు భగవంతు ని స్వరూపాలు.. కలా్లకపటం ఎరుగని కరుణామయులు.. రివ్వున ఎగిరే గువ్వలు.. వారికి విద్యతో పాటు మంచి విలువలను నేర్పుదాం.
నవంబర్ 14 వచ్చింది.. బాలలకు బోలెడు సందడి తెచ్చింది. ఈ రోజంటే పిల్లలకు పండగ లాంటిది. బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకొంటారు. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ. పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే వల్లమానిన ప్రేమ. ఆయనను ముద్దుగా ‘చాచా నెహ్రూ’, ‘చాచాజీ’ అని పిలుచుకుంటారు. అందుకే 1889 నవంబర్ 14న నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన బర్త్‌డేను ‘చిల్ర్డన్స్ డే’ నిర్వహించడం ఆనవాయితీ. ఈ రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం ఉంటుంది. పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, ఇతర కానుకలను పంచిపెడతారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లల్లో ఉత్సాహం నింపుతారు.
కరీంనగర్ అర్బన్/సిరిసిల్ల టౌన్: పిల్లలకు పౌష్టికాహారం అందితేనే ఆరోగ్యంగా ఉంటారు.. నాణ్యమైన విద్యనందిస్తే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు.. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి.. నార్మల్ డెలివరీ అయితే భవిష్యత్‌లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు.. విద్యార్థినులకు రక్షణ ఉండాలి.. పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలి.. ఇవన్నీ గుర్తెరిగిన కరీంనగర్, రాజన్నసిరిసిల్ల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్‌కుమార్ ఝా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఒకరు శుక్రవారం సభ పేరిట అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తూ, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందేలా చూస్తుంటే.. మరొకరు పాఠశాలలు, కళాశాలల్లో గర్ల్ చైల్డ్ ఎంపవర్‌మెంట్ క్లబ్‌లు ఏర్పాటు చేయిస్తున్నారు.
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. జిల్లాలో శుక్రవారం సభ పేరిట అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. ఏఎన్‌ఎంల ద్వారా గర్భిణులకు వైద్య సేవలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల ద్వారా చిన్నారుల ఎత్తు, వయసుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. గర్భిణులకు నార్మల్ డెలివరీ అయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఇక, తన పుట్టినరోజుతోపాటు వివిధ సందర్భాల్లో కలిసేవారు పుష్పగుచ్ఛాలు కాకుండా పెన్నులు, పుస్తకాలు, నోట్‌బుక్కులు తీసుకురావాలని సూచించగా కుప్పలు తెప్పలుగా వచ్చాయి. వాటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేశారు.
అలాగే, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే సినిమాలు చూపిస్తూ వాటిపై సమీక్షలు రాయిస్తున్నారు. హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలపై ఆరా తీస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. సైన్స్ మ్యూజియాన్ని తెరిపించి, సైన్స్ చర్చలు, సదస్సులు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పదోతరగతిలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా బాద్యతలు చేపట్టినప్పటి నుంచి బాలల విద్యాభ్యాసంపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ టీచర్ల పనితీరును పరిశీలిస్తున్నారు.
ఆయనే స్వయంగా పాఠాలు బోధిస్తూ.. విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. గురుతర బాధ్యతలు విస్మరించే ఉపాధ్యాయులకు సింహస్వప్నంగా ఉంటున్నారు. స్కూళ్లను సందర్శించిన సమయంలో ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఆడపిల్లల రక్షణకు, వారి సమస్యల పరిష్కారం కోసం గర్ల్ చైల్డ్ ఎంపవర్‌మెంట్ క్లబ్‌లు ఏర్పాటు చేయిస్తున్నారు. విద్యా ప్రమాణాల వృద్ధిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment