సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతమైంది. మనీ లాండరింగ్‌కు పాల్పడిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) దృష్టికి సీఐడీ తీసుకొచ్చింది. చట్టాలను ఉల్లంఘించి రామోజీరావు, ఆయన కుటుంబం పాల్పడుతున్న ఆర్థిక మోసాలను ఆధారాలతో సహా వివరించింది. మరోవైపు సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో బుధవారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాల్లో అక్రమ పెట్టుబడులు, చందాదారులు సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా బదిలీకి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. ప్రధానంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజ కిరణ్, సంస్థ డైరెక్టర్ల పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సంస్థ బ్యాలన్స్ షీట్లు, నగదు–చెక్కు వ్యవహారాలకు సంబంధించిన రికార్డులు, నిధుల మళ్లింపునకు సంబంధించిన రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో వెలుగు చూసిస ఆర్థిక అక్రమాలకు మూలం అంతా హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయమేనని వెల్లడైంది.
బెడిసికొట్టిన ఏ–1 రామోజీ, ఏ–2 శైలజ పన్నాగం
ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజ కిరణ్ ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు చేసిన ప్రయత్నాలను సీఐడీ తాజా సోదాలతో అడ్డుకుంది. ఈ నెల 3న రామోజీరావును, శైలజను ఈ నెల 6న సీఐడీ అధికారులు విచారించిన విషయం విదితమే. మార్గదర్శి చిట్‌ఫండ్స్ నుంచి నిధులు మళ్లించామని అంగీకరిస్తూనే ఆ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని, అంతా బ్రాంచి మేనేజర్లు (ఫోర్‌మెన్) చూసుకుంటారని ఈ సందర్భంగా రామోజీరావు అడ్డగోలుగా వాదించారు. మరోవైపు శైలజా కిరణ్ కూడా అదే రీతిలో విచారణకు సహకరించకుండా సహాయ నిరాకరణ చేశారు.
అక్రమంగా బదిలీ చేసింది వారిద్దరే
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుల సొమ్మును అక్రమంగా మళ్లించింది సంస్థ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణేనని సీఐడీ సోదాల్లో వెల్లడైంది. ఆ నిధులను రామోజీరావు కుటుంబానికి చెందిన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, మార్గదర్శి చిట్‌ఫండ్స్(కర్ణాటక)– బెంగళూరు, మార్గదర్శి(తమిళనాడు)–చెన్నై సంస్థల్లోకి మళ్లించారు. కంపెనీ చైర్మన్ హోదాలో రామోజీరావు, ఎండీ హోదాలో శైలజతోపాటు డైరెక్టర్ల ఆమోదంతోనే ఆ నిధులు మళ్లించారనేందుకు కీలక ఆధారాలు సీఐడీకి లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు కేసు దర్యాప్తులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని విశ్వసనీయ సమాచారం.
ఆ చెక్కులు ఎక్కడ..?
ఏటా సరిగ్గా.. మార్చి 31న రూ.వందల కోట్ల విలువైన చెక్కులు వస్తున్నట్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ తన బ్యాలన్స్ షీట్‌లో చూపిస్తోంది. 2022 మార్చి 31న కూడా రూ.550 కోట్ల విలువైన చెక్కులు వచ్చినట్లు చూపించారు. కానీ నిర్ణీత 90 రోజుల్లోగా ఆ చెక్కులను నగదుగా మార్చడం లేదని సీఐడీ అధికారుల సోదాల్లో వెలుగులోకి వచ్చింది. చెక్కుల్లో చూపిస్తున్న నిధులను రామోజీ తన కుటుంబ ప్రయోజనాల కోసం అక్రమంగా తరలిస్తున్నారు.
దీనిపైనే సీఐడీ అధికారులు ప్రశ్నించడంతో శైలజా కిరణ్ షాక్‌కు గురయ్యారు. ఆ చెక్కులు నగదుగా మారాయో లేదో రికార్డులు తమ వద్ద లేవని చెప్పడంతో ప్రధాన కార్యాలయానికి వెళ్లి పరిశీలిద్దామని సీఐడీ అధికారులు సూచించారు. అందుకు ఆమె అంగీకరించకపోగా సీఐడీ అధికారులు అక్కడకు వెళ్లేందుకు కూడా సమ్మతించలేదు. ప్రధాన కార్యాలయంలోని కీలక రికార్డులను సీఐడీ పరిశీలించేందుకు శైలజా కిరణ్ ఒప్పుకోకపోవడం ఈ కేసులో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు బుధవారం నిర్వహించిన సోదాల్లో ఏటా బ్యాలన్స్ షీట్‌లో చూపిస్తున్న చెక్కులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అసలు చెక్కులు రావడంగానీ, వాటిని నగదుగా మార్చడం గానీ జరగడం లేదని గుర్తించారు.
నగదు రూపంలో ఏటా రూ.500 కోట్లు
మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిబంధనలకు విరుద్ధంగా ఏటా రూ.500 కోట్లను నగదు రూపంలో వసూలు చేస్తున్నట్లు బ్రాంచి కార్యాలయాల్లో గతంలో నిర్వహించిన సోదాల్లో వెలుగు చూసింది. కానీ ఆ నిధులను బ్రాంచి కార్యాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంలేదు. ఆ నగదు నిల్వలేవీ ప్రధాన కార్యాలయంలోని రికార్డుల్లో కూడా లేనట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. అంటే ఆ డబ్బులను నల్లధనం రూపంలో అక్రమంగా తరలిస్తున్నట్లు రూఢీ అయింది. అందుకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రామోజీ బెంబేలు
మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను సీఐడీ ఆధారాలతో సహా జాతీయ దర్యాప్తు సంస్థల దృష్టికి తేవడంతో ఈ కేసులో ఏ–1గా ఉన్న రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. సీఐడీ దర్యాప్తుపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన ఆయన తొలిసారిగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిట తాజాగా పత్రికా ప్రకటన జారీ చేశారు. ఈడీ, సీబీడీటీ దర్యాప్తు తప్పదేమోనన్న ఆందోళన అందులో వ్యక్తమైంది. రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యకలాపాలు నిలిచిపోయాయని ఆ ప్రకటనలో అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొత్త చిట్టీలు ఏవీ ప్రారంభించడం లేదని పేర్కొనడం గమనార్హం.
చదవండి: అడ్డంగా దొరికినా అడ్డదారిలోనే!
Comments
Please login to add a commentAdd a comment