ఖమ్మం జిల్లా బోనకల్‌లోని ఎస్సీ గురుకులంలో భోజనాన్ని పరిశీలిస్తున్న భట్టి విక్రమార్క
సాక్షిప్రతినిధి, ఖమ్మం: బాసర ట్రిపుల్ ఐటీతోపాటు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాయనున్నట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లాలోని బోనకల్ ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. గురుకులంలో 550 మంది విద్యార్థులు ఉండగా, సరిపడా గదులు, పడకలు లేక నేలపైనే పడుకుంటున్నట్లు బాలికలు భట్టి దృష్టికి తీసుకెళ్లారు.
పాఠశాల సందర్శన అనంతరం భట్టి ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, వసతి గృహాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను స్వయంగా పరిశీలించి విద్యార్థుల సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావే శాల్లో ప్రస్తావిస్తానని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలైనా విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీతో పాటు సిద్దిపేట, మహబూబాబాద్, మెదక్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులు పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో మాట్లాడతానని భట్టి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment