ఖమ్మం సహకారనగర్: రాజ్యాంగాన్ని మార్చాలని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు దేశ ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నట్లు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ పేర్కొనడం ప్రజల చట్టబద్ధ హక్కులపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. అసమానతలు తొలగించి, సమసమాజ స్థాపనకు పునాదులు వేసిన భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడమంటే రాచరిక వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలనే కుట్రగా చూడాలని తెలిపారు.
తాజాగా ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యమంత్రి వాడిన భాష ఫ్యూడల్ నాయకుల మాదిరిగా ఉందని పేర్కొన్నారు. ఎన్నడూ రాజ్యాంగాన్ని గౌరవించని కేసీఆర్ ఇప్పుడు భావోద్వేగాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని భట్టి విమర్శించారు. రాష్ట్ర రాజకీయాలు, ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తున్న కేసీఆర్‌ను ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment