Telangana: జూన్‌ 15నుంచి రైతుబంధు | Cm Kcr Agriculture Meeting Rythu Bandhu Telangana Farmers June | Sakshi
Sakshi News home page

Telangana: జూన్‌ 15నుంచి రైతుబంధు

Published Sat, May 29 2021 10:13 PM | Last Updated on Sun, May 30 2021 8:00 AM

Cm Kcr Agriculture Meeting Rythu Bandhu Telangana Farmers June - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెల 15వ తేదీ నుంచి రైతుబంధు ఆర్థిక సహాయం పంపిణీ ప్రారంభించి 25వ తేదీలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడూ అనుసరిస్తూ రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావుకు సూచించారు. ఇప్పటిదాకా ఇచ్చిన కేటగిరీల వారీగానే రైతు బంధు ఆర్థిక సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు. జూన్‌ 10ని కటాఫ్‌ తేదీగా పెట్టుకుని, ఆ తేదీలోగా పార్ట్‌–బీ (ధరణిలోని నిషేధిత భూముల జాబితా) నుంచి పార్ట్‌–ఏ లోకి చేరిన భూములకు సైతం రైతుబంధు వర్తింపజేయాలని ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  

పీడీ యాక్టు కింద అరెస్టులు చేయండి 
‘వారం రోజుల్లో రుతుపవనాలు వస్తున్నందున రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను అందుబాటులో ఉంచాలి. పత్తి, కంది, వరి ధాన్యం విత్తనాలను అవసరమైన మేరకు సేకరించి రైతులకు అందించాలి. కల్తీ విత్తనాలు, పురుగుల మందులపై, బయో పెస్టిసైడ్స్‌ పేరుతో మార్కెట్లోకి వస్తున్న కల్తీ ఉత్పత్తుల మీద వ్యవసాయ, పోలీసు, ఇంటెలిజెన్స్‌ శాఖలు ఉక్కుపాదం మోపాలి. జిల్లాల్లో కల్తీ విత్తన తయారీదారులపై దాడులు జరపాలి. వలవేసి పట్టుకోవాలి. ఎంతటి వారినైనా పీడీ యాక్టు కింద అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

చిత్తశుద్ధితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులకు ఆక్సిలరీ ప్రమోషన్, ప్రోత్సాహకాలతో పాటు ఉత్తమ సేవ పతకం అందజేస్తాం..’అని సీఎం ప్రకటించారు. తక్షణమే జిల్లాల వారీగా పోలీసులను రంగంలోకి దించాలని డీజీపీని ఫోన్లో ఆదేశించారు. నిఘావర్గాల ద్వారా కల్తీ విత్తన తయారీ ముఠాలను కనిపెట్టాలని ఇంటిలిజెన్స్‌ ఐజీని ఆదేశించారు. 

మీరు నర్సింహావతారం ఎత్తాలె.. 
‘ఇగ మీరు నర్సింహావతారం ఎత్తాలె. దొరికినోన్ని దొరికినట్టే పట్టుకొని íపీడీయాక్టు పెట్టాలె. ఇగ తెలంగాణల కల్తీ విత్తనాలు అమ్మలేమురా అనేటట్టు మీ చర్యలుండాలె. కల్తీ విత్తనాల మీద యుద్దం ప్రకటించాలె’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కల్తీని అరికట్టడానికి చట్ట సవరణ చేయాలని, అవసరమైతే ఆర్డినెన్స్‌ జారీ చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను కోరారు. అనుమతి కలిగిన కంపెనీల ద్వారానే విత్తనాలు, పురుగుల మందుల విక్రయాలు జరిగేలా చూడాలని, ప్రభుత్వం జారీ చేసే క్యూఆర్‌ కోడ్‌ సీడ్‌ ట్రేసబిలిటీ విధానాన్ని అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డికి కేసీఆర్‌ సూచించారు.

స్మార్ట్‌ ఫోన్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే తక్షణమే విత్తన కంపెనీల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని ముఖ్యమంత్రి వివరించారు. ‘వ్యవసాయ అధికారులు ఎవరైన కల్తీ విత్తన ముఠాలతో కుమ్మక్కై వారికి సహకరించినట్టు రుజువైతే తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. కల్తీ నియంత్రణ కోసం జిల్లా వ్యవసాయ అధికారి, అసిస్టెంట్‌ డైరెక్టర్లు బాధ్యత వహించాలి. కల్తీ నిర్మూలనపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలు, పోలీసు కమిషనర్లు సమీక్షలు నిర్వహించాలి. తెలంగాణలో గోదాముల సామరŠాధ్యన్ని 40 లక్షల టన్నులకు పెంచేందుకు మార్కెంటింగ్‌ శాఖ చర్యలు తీసుకుంటోంది..’అని సీఎం తెలిపారు. వ్యవసాయ శాఖ రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించుకోవాలని సూచించారు. 


విత్తనాలు వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలి 
విత్తనాలు వెదజల్లి వరి సాగు చేస్తే.. రెండు పంటలకు కలిపి ఏడాదిలో కోటి ఎకరాలు సాగు చేసే తె లంగాణ రైతులకు సుమారు రూ.10 వేల కోట్లపైనే పెట్టుబడి మిగులుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘ఈ పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి 2–3 బస్తాలు (1–2 క్వింటాళ్లు) అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీని గురించి రైతులకు అధికారులు విస్తృత అవగాహన కల్పించాలి. వరి విత్తనాలను వెదజల్లడం ద్వారా బురదలో కాలు పెట్టకుండానే వరి పంట వేసుకోవచ్చు. నారు పోసే పని లేదు. నారు పీకే పని లేదు.

నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30– 35 శాతం తగ్గుతుంది. 10–15 రోజుల ముందు పంట వస్తుంది. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8కిలోల విత్తనపొడ్లు సరిపోతయి. వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడే దాక కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిది. కాళేశ్వరం సహా అన్ని సాగు నీటి ప్రాజెక్టులు, లిఫ్టులు, సుమా రు 30 లక్షల బోరుబావుల పరిధిలో వరి సాగు చేసే రైతులకు ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది.

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వివక్ష తగదు 
‘రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యాన్ని కొనడం అంటే ఒక సాహసం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసాన్ని తెలంగాణ చేసింది. కరోనా సమయం లో లారీలు, హమాలీలు, డ్రైవర్లు అన్నీ కొరతే అయి నా వాటన్నిటినీ అధిగమిస్తూ, ఇప్పటికే 87శాతం ధాన్యం సేకరించినం. మరో నాలుగైదు రోజుల్లో సంపూర్ణంగా సేకరిస్తాం. ఎఫ్‌సీఐతో మాట్లాడి ఎం త ధాన్యం వచ్చినా తప్పకుండా ప్రభు త్వం కొం టుంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళనలకు గురికావద్దు. ఆగమాగం కావద్దు. తెలంగాణలో పండుతున్న వరి ధాన్యం మొత్తాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నాం. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయనున్నాం..’అని కేసీఆర్‌ తెలిపారు. పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో వంద శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్‌సీఐ .. తెలంగాణలో సేక రించక పోవడంపై సీఎం అసంతృప్తి్త వ్యక్తం చేశా రు. కేంద్రం ఇలా వివక్ష చూపడం సరికాదన్నారు.


మా లక్ష్యం నెరవేరింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం  
కొత్త రాష్ట్రం తెలంగాణలో వ్యవసాయ రంగానికి పునరుజ్జీవం పోసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ‘మిషన్‌ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించాం. రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చి వేశాం. కేసులేసి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అవాకులు చెవాకులు పేలినా, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వెనకడుగు వేయకుండా పట్టుపట్టి పూర్తి చేసుకోగలిగాం. తద్వారా తెలంగాణ రైతుకు నేడు వ్యవసాయం మీద ధీమా పెరిగింది. తెలంగాణ వ్యవసాయం ఎక్కడ ప్రారంభమైంది. ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నదనే విషయాన్ని పరిశీలించినప్పుడు సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. నీటికి కటకటలాడిన తెలంగాణలో నేడు 75 శాతం చెరువులు నదీ జలాలలతో నిండి ఉన్నయి. నడి వేసవిలో నిండుకుండలను తలపిస్తున్నయి.  

పంజాబ్‌తో సమానంగా దిగుబడి 
రెండు పంటలకు కలిపి రాష్ట్రంలో నేడు కోటిన్నర టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారంటే మామూలు విషయం కాదు. పంజాబ్‌కు సరిసమానంగా తెలంగాణలో వరి దిగుబడి అవుతున్నది. అలాగే ప్రభుత్వం ఒక్క గింజను కూడా పోనియ్యకుండా నేరుగా రైతుల కల్లాల్లోనే కొంటున్నది..’అని సీఎం అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని ప్రతిపక్షాలు కుయుక్తులకు పాల్పడుతుంటే రైతులు తిప్పి కొడుతున్నారని, వారి ఆటలు సాగనిస్తలేరని కేసీఆర్‌ పేర్కొన్నారు. రైతుబంధు సహాయం వల్ల రైతులు శావుకారు దగ్గరికి అప్పులకు పోకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలు కొని అధిక దిగుబడిని సాధించగలుగుతున్నారని చెప్పారు.  

రైతుబంధు కింద రూ.35,676 కోట్లు జమ
సాక్షి, హైదరాబాద్‌: రైతన్నల వ్యవసాయ వ్యయాన్ని కొంతమేరకు తగ్గించడంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం 2018 నుంచి యేటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తోంది. ఇప్పటి వరకు మొత్తం రూ.35,676 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. అందులో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వానాకాలం, యాసంగి పంటల కోసం రైతుల ఖాతాల్లోకి రూ.14,656.01 కోట్ల రూపాయలను జమచేసింది. ఈసారి వానాకాలం పంటల కోసం రైతులకు వారి బ్యాంకు అకౌంట్లలో జూన్‌ 15 నుంచి 25వ తేదీలోగా మరో దఫా ఆర్థిక సాయాన్ని అందించనుంది. 2020 సంవత్సరం వానాకాలం సమయంలో 58.02 లక్షల మంది రైతులు సాగు చేసుకునే 145.77 ఎకరాల కోసం రూ.7,288.70 కోట్లు, అలాగే 2020–21 యాసంగి కాలానికి గాను 59.32 లక్షల మంది రైతులకు 147.35 లక్షల ఎకరాల కోసం రూ.7,367.32 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో వేసింది. 

చదవండి: ఇక ఐటీ ప్రాంతానికి వేగంగా ప్రయాణించే అవకాశం: కేటీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement