
సాక్షి, హైదరాబాద్: కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్‌లో భాగంగా ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో ఉన్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు బుధవారం రాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వచ్చారు. ఫామ్‌హౌజ్ నుంచి నేరుగా ఆస్పత్రికి వచ్చిన కేసీఆర్‌కు సీటీస్కాన్, సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు ఆరు రకాల పరీక్షలు చేసేందుకు వైద్యులు రక్త నమూనాలు సేకరించారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీరావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఇన్‌ఫెక్షన్ రేటు ఏ మేరకు ఉందన్న విషయం తెలుసుకునేందుకు సీటీ స్కానింగ్ చేశారు.
సీఎం కేసీఆర్ ఊపిరితిత్తులు సాధారణంగానే ఉన్నాయని, ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదని సీటీ స్కాన్ అనంతరం డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. రక్త పరీక్షలకు సంబంధించిన నివేదికలు గురువారం అందుతాయని వైద్యులు తెలిపారు. సీఎం ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. పరీక్షల అనంతరం సీఎం తిరిగి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయారు. యశోద ఆస్పత్రికి వచ్చిన సీఎం కేసీఆర్ వెంట ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్ కుమార్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment