సాక్షి, హైదరాబాద్: సర్జరీ అనంతరం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రిలోనే కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని పరామర్శించేందుకు ప్రముఖులు ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అయితే ఇవాళ సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఆస్ప్రతి వద్దకు చేరుకున్నారు. ఆయన్ని చూసేందుకు అనుమతించాలంటూ పోలీసులను కోరారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అందుకు పోలీసులు కుదరదని చెప్పారు. దీంతో కేసీఆర్.. బీఆర్‌ఎస్.. కేటీఆర్ నినాదాలతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
పోలీసులు చేతులెత్తిసిన క్రమంలో కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ఆయన క్యాడర్‌ను సముదాయించడంతో కాస్త శాంతించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ విజ్ఞప్తి..
మరోవైపు ఆస్పత్రి బయట పరిస్థితులు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి వెళ్లాయి. దీంతో బీఆర్‌ఎస్ కేడర్‌ను, అభిమానుల్ని ఉద్దేశించి ఆయన వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. ‘‘నేను కోలుకుంటున్నా.. త్వరలో మీ ముందుకు వస్తా. దయచేసి ఎవరూ ఆస్పత్రికి రావొద్దు. నాతో పాటు వందలాది మంది పేషెంట్లు ఇక్కడ ఉన్నారు. వాళ్లకు ఇబ్బంది కలిగించొద్దు. దయచేసి పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు సహకరించాలి. నాపట్ల అభిమానం చూపుతున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు: తెలంగాణ మంత్రులు
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలంగాణ మంత్రులు అన్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన్ని ఇవాళ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
‘‘మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ని పరామర్శించేందుకు వచ్చాం. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. బహుశా రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అవుతారేమో’’ అని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పగా.. ‘‘కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కోరాం. త్వరగా సభకు వచ్చి వారికున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని అందించాలని కోరాం. అందరూ నాయకులను కలుపుకుని ప్రజలకు మంచి పాలన అందిస్తామని ఆయనకు హామీ ఇచ్చాం. స్పీకర్ ఎన్నికలో కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేవిధంగా సహకరించాలని అడిగాం’’ అని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment