సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలగడానికి వీల్లేదని.. చట్టాన్ని చేతిలోకి తీసుకునేవారిని ఉపేక్షించాల్సిన ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకునే వారిపై, మతాల మధ్య చిచ్చుపెట్టే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వీడియో, తదనంతర పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లో ఎలాంటి మతపరమైన ఘర్షణలు లేకుండా ప్రజలు హాయిగా, ప్రశాంతంగా జీవిస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇలాంటి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా సహించేది లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరూ కూడా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేశారు.
వరుస ఘటనల నేపథ్యంలో..
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండు రోజుల కిందట విడుదల చేసిన వీడియోలో ఓ వర్గం మతగురువును కించపరిచారనే ఆరోపణలు, దానిపై మజ్లిస్ శ్రేణులు నిరసనలకు దిగడం, రాజాసింగ్ అరెస్టు, బెయిల్‌పై విడుదల తదితర ఘటనల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఆరోపణలతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కుమార్తె కవిత ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించడం.. బీజేపీ, టీఆర్‌ఎస్ వర్గాల ఘర్షణ, బీజేపీ కార్యకర్తలపై కేసులను నిరసిస్తూ బీజేపీ నిరసన కార్యక్రమాలకు దిగింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో పలుచోట్ల ఉద్రిక్తత, యాత్ర ఆపేయాలని వరంగల్ పోలీసుల నోటీసులతోనూ బీజేపీ ఆందోళనలు చేపట్టింది.
ఇక రాజాసింగ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్‌ఖాన్ ఓ వర్గం ప్రజలకు పిలుపునిచ్చారు. వీటన్నింటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ శాంతిభద్రతల పరిస్థితిపై హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో బుధవారం సాయంత్రం అత్యవసర సమీక్ష నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో పలు అంశాలపై చర్చించారు.
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు..
రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచీ శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తున్న విషయాన్ని సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా మత ఘర్షణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కొందరు మతాల మధ్య చిచ్చుపెట్టడానికి, విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడినట్టు తెలిసింది. ఎవరి మతాలు, ఆచారాలను వారు ఆచరించుకోవచ్చని.. కానీ ఇతరులను కించపర్చేలా వ్యవహరించడం సహించరానిదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ పరిస్థితిని అదనుగా చేసుకుని కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు రెచ్చిపోయే అవకాశం ఉంటుందని.. అందువల్ల ఆదిలోనే దీనిని తుంచివేయాలని ఉన్నతాధికారులకు సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసు యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన పక్షంలో మరిన్ని బలగాలను రప్పించి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలిసింది.
హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుంది
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగున్నందునే దేశవిదేశాల పెట్టుబడులు వస్తున్నాయని, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఏర్పాటవుతున్నాయని సీఎం కేసీఆర్ గుర్తుచేసినట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఘటనలపై జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతోందని.. ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజి దెబ్బతింటుందని హెచ్చరించినట్టు సమాచారం. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న వారిని ఓ కంట కనిపెట్టి ఉండాలని.. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా సున్నిత ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించినట్టు తెలిసింది.
ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు: మహమూద్ అలీ
శాంతిభద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంబిస్తోందని.. ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఇతర మతస్తుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడి అశాంతి సృష్టించాలనుకునే వారిని రాష్ట్ర ప్రభుత్వం సహించబోదని బుధవారం రాత్రి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయని.. వీటిపై చట్టపరమైన చర్యలు చేపడతామని ప్రకటించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. ఇతర మతాలను ఎవరూ కించపర్చరాదని, మనోభావాలను దెబ్బతీయరాదని స్పష్టం చేశారు. ప్రజలంతా సంయమనంతో, సోదరభావంతో ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment