సాక్షి, హైదరాబాద్: రైతులు ఆరుగాలం శ్రమించిన ధాన్యాన్ని కొనకుండా కేవలం రాజకీయం మాత్రమే చేస్తామనే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వైఖరిని సహించేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ రైతులకు ఇది జీవన్మరణ సమస్య అని.. రాష్ట్రాన్ని సాధించి ముందుకు తీసుకెళ్తున్నవాళ్లం ఈ అంశంపై మౌనంగా చూస్తూ ఉండబోమని చెప్పారు. యాసంగిలో పండే వరి ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా కొనుగోలు చేసేదాకా పోరాడుతామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ శనివారం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ‘‘ధాన్యం కొనుగోలు విషయంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై గతంలోనూ వివిధ రూపాల్లో ఆందోళన చేశాం. ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టీఆర్‌ఎస్ సిద్ధంకావాలి.
ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు తప్పనిసరిగా హాజరుకావాలి. ఆ సమావేశం ముగిశాక సోమవారం సాయంత్రమే ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్తుంది. ధాన్యం కొనుగోళ్ల మీద కేంద్ర మంత్రులను నిలదీద్దాం. అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేద్దాం. తెలంగాణలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్‌సభలో, రాజ్యసభలో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు..’’అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణభవన్‌లో జరిగే సమావేశానికి ఆహ్వానితులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.
ఉద్యమాన్ని తలపించేలా..
రాష్ట్రంలో సాగునీటి వసతి పెరిగి కరెంటు కష్టాలు తీరడంతో ఇబ్బడి ముబ్బడిగా వరి సాగు పెరిగిందని.. ధాన్యం కొనుగోళ్ల విషయంగా గత యాసంగి, వానాకాలాల్లో కేంద్రం మెలిక పెట్టడంతో ఇబ్బంది ఎదురైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని.. తనతోపాటు రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్రం వైఖరి నిరసిస్తూ ధర్నా చేసినా స్పందన కనిపించలేదని చెప్పారు. రాష్ట్రంలో సాగునీరు ఉన్నా కేంద్ర వైఖరిని దృష్టిలో పెట్టుకుని వరి సాగు చేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. అయినా రాష్ట్ర రైతులు సుమారు 36 లక్షల హెక్టార్లలో వరిసాగు చేశారని చెప్పారు. మరో పదిహేను రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయని.. కొనుగోలు కేంద్రాలు లేకపోతే రైతులు ఇబ్బందిపడటం ఖాయమని తెలిపారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్న బీజేపీ నాయకులు.. ఈ అంశంపై మాత్రం నోరు విప్పడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమాన్ని తలపించే రీతిలో కార్యాచరణ రూపొందించుకుని కేంద్రం మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యాచరణలో కేవలం పార్టీ యంత్రాంగమే కాకుండా.. రైతులను, వివిధ వర్గాలను కూడా భాగస్వాములను చేస్తామన్నారు.
బీజేపీ రాజకీయాన్ని నిలదీయాలి
మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం సుదీర్ఘంగా సుమారు నాలుగు గంటలకుపైగా సాగింది. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే తలెత్తే పరిణామాలు, కేంద్రం వైఖరి, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఏ తరహా కార్యాచరణ చేపట్టాలనే అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ‘‘రాష్ట్రంలో బీజేపీ అనవసర విషయాల మీద రాద్ధాంతం చేస్తోంది. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ సోషల్ మీడియా ద్వారా విషాన్ని కక్కుతున్న తీరును ప్రజలకు వివరించాలి..’’అని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది.
జాతీయ రాజకీయాలు, ముందస్తు ప్రస్తావన లేదు!
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టీఆర్‌ఎస్, వివిధ రాజకీయ పార్టీలు చేపడుతున్న కార్యక్రమాలు, ఇతర అంశాలను మంత్రులతో భేటీలో కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే జాతీయ రాజకీయాలు, అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల ప్రస్తావనేదీ రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక బీజేపీ, ఇతర రాజకీయ పార్టీల నేతలు పాదయాత్రలు, సభలతో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. అవేవీ పెద్దగా ఫలితం ఇవ్వబోవని అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది.
పరుగుపరుగున ఫామ్‌హౌజ్‌కు..
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న సీఎం కేసీఆర్ నుంచి మంత్రులు, అధికారులు సమావేశానికి రావాలంటూ శనివారం ఉదయమే పిలుపు అందింది. అప్పటికే వేర్వేరు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల్లో ఉన్న వీరంతా హుటాహుటిన ఫామ్‌హౌజ్‌కు వరుస కట్టారు. మంత్రులు టి.హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు సీఎం భేటీకి వచ్చారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల కార్యక్రమంలో ఉన్న మంత్రి హరీశ్‌రావు అందరికంటే చివరిగా వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సీఎం ఫామ్‌హౌజ్‌కు రావాలని మంత్రులందరికీ అకస్మాత్తుగా పిలుపు రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై వివిధ రకాల ఊహాగానాలు ప్రచారమయ్యాయి.
►ఉదయం 11.30కు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5.30 వరకు సుదీర్ఘంగా కొనసాగింది. వ్యవసాయ క్షేత్రంలోనే మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్నం భోజనం చేశారు. స్వల్ప విరామం తర్వాత తిరిగి సమావేశాన్ని కొనసాగించారు.
►టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శనివారం పొద్దునే అమెరికా పర్యటనకు బయలుదేరడంతో ఈ భేటీకి హాజరుకాలేదు.
►మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితోపాటు మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి పలు అధికారిక కార్యక్రమాల కారణంగా సమయానికి ఫామ్‌హౌజ్‌కు చేరుకోలేకపోయినట్టు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment