
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు తొమ్మిదేళ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో సాగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, విద్యుత్, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లె పల్లెనా చాటుతూ ప్రజల భాగస్వామ్యంతో వేడుకగా జరుపుకోవాలని సూచించారు.
దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ ఉత్సవాల ప్రారంభ వేడుకలను జూన్ 2న సచివాలయంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.
ఇదో గొప్ప సందర్భం
దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ చరిత్రలో గొప్ప సందర్భమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒకనాడు అనేక అవమానాలకు, అపోహలకు గురైన తెలంగాణ నేడు అత్యద్భుతంగా వెలుగొందుతోందని.. విద్యుత్, వ్యవసాయం, సాగునీరు సహా ప్రతి రంగంలో దేశానికే ఆదర్శంగా ప్రగతిని నమోదు చేసుకుంటూ పోతోందని పేర్కొన్నారు. స్వయంపాలన ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ‘‘ఒకనాడు కరెంటు కోతలతో కారు చీకట్లలో మగ్గిన తెలంగాణ నేడు వెలుగులు విరజిమ్ముతోంది. 24 గంటల విద్యుత్‌ను రైతాంగానికి ఉచితంగా అందిస్తున్నాం.
ఇదే తరహాలో పటిష్టపరిచిన వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం ప్రతి రంగంలో అభివృద్ధి సాధించాం. ఎంతగానో కష్టపడితే తప్ప ఇవన్నీ సాధ్యం కాలేదు. ఈ అభివృద్ధిని పేరుపేరునా ప్రసార మాధ్యమాలు, ఇతర మార్గాల ద్వారా ప్రజలకు చేరవేయాలి. స్వరాష్ట్ర సాధన ఫలాలను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలతో ఈ మూడు వారాలపాటు మమేకం కావాలి. వారి భాగస్వామ్యంతో పల్లె నుంచి పట్నం దాకా దశాబ్ది ఉత్సవాలను ఆటపాటలతో పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలి’’ అని సీఎం కేసీఆర్ సూచించారు.
సచివాలయంలో ఏర్పాట్లు
జూన్ 2న దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవాన్ని సచివాలయంలో నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. వేదిక ఏర్పాటు, పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, జాతీయ జెండా ఆవిష్కరణ తదితర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ చర్చించారు. ఆహ్వానితులకు పార్కింగ్ సౌకర్యం, అతిథులకు ‘హైటీ’ ఏర్పాటు వంటివి ఎక్కడ, ఎలా నిర్వహించాలనే దానిపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలతోపాటు గ్రామ స్థాయి వరకు 21 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment