
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజును ప్రజలు మంచి మహుర్తంగా భావిస్తున్నందున సీఎం కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్ ప్రారంభించనున్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను దసరా లోపే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ కు అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బ్యాండ్ విడ్త్ లను సిద్ధం చేయాలని చెప్పారు. కాగా మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ చేయడం, ధరణి పోర్టల్ కు వివరాలను అప్ డేట్ చేయడం తదితర అంశాలు, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ లకు శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు.
డెమో ట్రయల్స్ నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ప్రతి మండలం, ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ నియామకాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నట్లు సిఎం తెలిపారు. అదే రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలోడాక్యుమెంట్ రైటర్స్‌కు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటాను ధరణి పోర్టల్ లో ఎంటర్ చేయాలని అధికారులను కోరారు. ఆ తర్వాత జరిగే మార్పు చేర్పులు వెంటనే నమోదు చేయడం జరుగుతుందని సీఎం తెలిపారు. దసరా రోజున పోర్టల్ ప్రారంభిస్తునందున అదే రోజు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని సీఎం పేర్కొన్నారు. ఈలోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు కానీ, ఎలాంటి రెవెన్యూ వ్యవహారాలు కానీ జరగవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment