సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పర్యటిస్తున్నారు. దళితవాడలో కాలినడకన ఇంటింటికి వెళ్లి ‘దళితబంధు’ పథకం గురించి ఏ మేరకు అవగాహన ఉందో దళితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తున్నారు.
‘‘భారతదేశంలో ఏళ్లుగా అణచివేతకు గురైన జాతి దళిత జాతి. కొందరు మహాత్ములు ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించారు. వారిలో ముఖ్యులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. 60 ఏళ్ల క్రితం ఆయన దళితుల కోసం పోరాటం చేయగా విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు లభించాయి. ఆయన మార్గం చూపారు. కానీ పూర్తి స్థాయిలో దళితుల అభివృద్ధి జరగలేదు. గత ప్రభుత్వాలు సరైన దిశలో దళితుల అభివృద్ధి గురించి ఆలోచించకపోవడం వల్లనే వారు ఇంకా పేదలుగానే ఉన్నారు’’ అన్నారు.
‘‘20 ఏళ్లు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఈ రోజు 24 గంటల కరెంటు ఇస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నాం. గొల్ల, కురమలకు గొర్లు, గీత కార్మికులకు సాయం, సామాజిక వర్గాల వారిగా చేయూతనందిస్తున్నాం. ముసలి, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నాం’’ అని కేసీఆర్ తెలిపారు.
ఏడాది క్రితమే దళిత బంధు ప్రాంరభం కావాల్సి ఉండే..
‘‘ఏడాది క్రితమే దళిత బంధు ప్రారంభం కావాల్సి ఉండే. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అందుకే ఈ మధ్యనే దాన్ని ప్రారంభించాం. నెలల పాటు ఆలోచించి.. ఈ పథకాన్ని రూపొందించాం. దీన్ని విఫలం కానివ్వొద్దు. లబ్ధిదారులు దీన్ని వాడుకుని అభివృద్ధి చేసి చూపించాలి. దళితవాడలు ఐకమత్యంగా ఉండాలి. ఈర్ష్య , కోపం లేకుండా అందరం ప్రేమ భావనతో ఉండాలి. పథకాన్ని విజయవంతం చేయాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
‘‘ఈ మార్గంలో వెళ్లేటప్పుడు నేను వాసాలమర్రిని పరిశీలించాను. మీ ఊరు బలే గమ్మత్తుగా ఉంటది. ఈ ఊర్లో ఉన్నన్ని మట్టి గోడలు ఎక్కడా లేవు. ఒక్కటి కూడా ఇటుకల ఇళ్లు లేవు. గందరగోళంగా ఉంది ఊరి పరిస్థితి. ఎర్రవెల్లి కూడా ఇలానే ఉంటుండే. అందరం కూర్చుని ఆలోచించాం. ఊరు కూలగొట్టి.. కొత్తగా నిర్మిద్దాం అని చెప్పి వారిని ఒప్పించాను. టెంట్లు తెప్పించి ఊరును అందులో పెట్టా. ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక గృహప్రవేశాలు చేశాం. ఇక్కడ కూడా అలానే జరగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కేసీఆర్.
వాసాలమర్రి బీసీలను కూడా ఆదుకుంటాం..
‘‘ఇక్కడ దళిత వాడలో ఇళ్లు కూడా అలానే ఉన్నాయి. దీన్ని కూడా ఎర్రవెల్లి మాదిరిగానే అభివృద్ధి చేద్దాం. దళితులే కాదు.. ఊరంతా ఉన్న బీసీలు కూడా పేదలుగానే ఉన్నారు. వారిని కూడా ఆదుకుందాం. ఈ గ్రామంలో ప్రభుత్వ జాగా 612 ఎకరాలు ఉంది. దళితుల దగ్గర భూమి తక్కువ ఉంది. దీని గురించి ర్యాప్తు చేయమని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చాను. మరో 100 ఎకరాల భూమి తేలింది. దాన్ని దళితులకు ఇద్దాం. వాసాలమర్రిలో కొత్త చరిత్ర సృష్టించాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
‘‘దళిత భూముల కమతాలను ఏకీకరణ చేద్దాం. దళిత బంధును పూర్తిగా నిరుపేదలకు తొలుత అందిస్తాం. మీ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నాను కనుక వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు తక్షణమే దళిత బంధు అందిస్తాం. ఇవాళే జీవో విడుదల చేయిస్తాం. రేపట్నుంచే మీ అకౌంట్లలో రూ. 10 లక్షలు జమ చేస్తాం. దళిత బంధు సొమ్మును వృధా కానివ్వొద్దు’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
దళిత రక్షణ నిధి ఏర్పాటు..
‘‘ప్రభుత్వం మీకిచ్చే దళిత బంధు సొమ్ములో రూ. 10 వేలు కట్ చేస్తుంది. దానికి ప్రభుత్వం తరఫున మరో 10 వేల రూపాయలు జమ చేస్తాం. ఆలేరు నియోజకవర్గంలో 15 వేల దళిత కుటుంబాలుంటే.. వారందరి నుంచి 10 వేల రూపాయలు కట్ చేసి.. ప్రభుత‍్వం మరో 10 వేల రూపాయలు జమ చేసి మొత్తం 30 కోట్ల రూపాయలతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తాం. అనారోగ్యం, ప్రమాదాలు జరిగినప్పుడు అయ్యే ఆస్పత్రి ఖర్చులకు వినియోగించేలా దళిత రక్షణ నిధి నుంచి సొమ్ము తీసుకుంటాం. దీని మీద పూర్తి పెత్తనం దళితులదే’’ అన్నారు కేసీఆర్.
దళిత బంధుతో పాటు మిగతా అన్ని పథకాలు వర్తిస్తాయి..
‘‘దళితబంధు ఇచ్చాక ఓ కార్డు ఇస్తాం. దాని ద్వారా మీకిచ్చిన డబ్బును పర్యవేక్షిస్తాం. అలా కాకుండా డబ్బును వృధా చేస్తే.. జనాలు నన్ను తిడతారు. వాసాలమర్రే ఆలేరు నియోజకవర్గానికి ఆదర్శం కావాలి. దళితబంధును సద్వినియోగం చేసే బాధ్యత అక్కచెళ్లమ్మల్లదే. కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకుని పట్టు పట్టి.. జట్టు కట్టి.. గెలిచి చూపాలి. మీరే నా అతిపెద్ద ఆయుధం. పది లక్షల రూపాయాల్లో పది పైసలు కూడా వృధా చేయవద్దు. దీని నుంచి సంపాదించిన సొమ్ముతో అభివృద్ధి చెందాలి. నిదానంగా ఆలోచించి.. మంచి ప్రణాళికతో ముందడుగు వేయాలి. వందకు వంద శాతం విజయవంతం చేసి చూపించాలి. దళిత బంధు ఇచ్చామని మిగతా పథకాలను ఆపం. ఇది అదనపు సదుపాయం’’ అన్నారు కేసీఆర్.
Comments
Please login to add a commentAdd a comment