దళితబంధులో రూ.10లక్షలకుగాను రూ.రెండు లక్షల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్న వారి చిట్టా నాదగ్గర ఉంది. వెంటనే సరిదిద్దుకోని పక్షంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కాదు కదా పార్టీ నుంచే బయటకు పంపిస్తా.. దళితబంధులో అనుచరులు అవినీతికి పాల్పడినా ఎమ్మెల్యేలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
– సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘దళితబంధు పథకం నా ఆత్మ బంధువు. దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పథకంపై చర్చ జరుగుతోంది. ఈ పథకం ద్వారా బాగుపడిన కుటుంబాల విజయగాథలతో మరింత మంది స్ఫూర్తి పొందాలి. దీనిని పారదర్శకంగా అమలు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే. ఎవరైనా ఒక్క రూపాయి కమీషన్, వాటా, ఇతర రూపంలో తీసుకున్నట్టు తెలిసినా అడ్డంగా నరికేస్తా..’’ అని ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. దళితబంధు సామాజిక పెట్టుబడి అని, దళితుల్లో వజ్రాలను వెలికి తీస్తుందని చెప్పారు.
రాబోయే రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ రూ.6 లక్షల కోట్లకు చేరుతుందని, ఎన్ని కష్టాలొచ్చినా దళితబంధును కొనసాగిస్తామని ప్రకటించారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యే,లు ఎమ్మెల్సీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులకు కీలక అంశాలపై దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఎన్నికలకు నాలుగు నెలలే..
‘‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో 63, 2018లో 88 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాం. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలుస్తాం. 2018 డిసెంబర్ తొలివారంలో ఓట్ల లెక్కింపు జరిగి రెండోసారి అధికారంలోకి వచ్చాం. ఈ ఏడాది నవంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే చాన్స్ ఉంది. అంటే ఎన్నికలకు కేవలం నాలుగు నెలల సమయమే ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు తమ కార్యాచరణ రూపొందించుకోవాలి. జాగ్రత్తగా లేకపోతే మీకే నష్టం.
జనంతో మమేకం కావాల్సిందే..
నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు ఇద్దరేసి చొప్పున నాయకులకు బాధ్యతలు అప్పగిస్తాం. పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట ఎంపీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు ఇన్‌చార్జులుగా బాధ్యతలు తీసుకోవాలి. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావడంతోపాటు కేడర్‌లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టాలి. నిత్యం ప్రజలతో ఉంటూ.. ప్రభుత్వ పథకాల ప్రచారం, ప్రజలతో కమ్యూనికేషన్ పెంచుకునేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి.
దాహమైనప్పుడే బావి తవ్వుదామనే ధోరణి ప్రస్తుత రాజకీయాలకు సరిపోదు. ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలనే ధోరణితో కాకుండా కచ్చితంగా మననే ఎన్నుకోవాలనే రీతిలో పనిచేయాలి. మన ప్రభుత్వం మరోమారు అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు.. మునుపటికంటే ఎక్కువ సీట్లు రావాలన్నదే ప్రాధాన్యతాంశం. త్వరలో ఒక్కో ఎమ్మెల్యేతోవ్యక్తిగతంగా మాట్లాడుతా.
మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఆదరణ
మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఆదరణ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్త పర్యటనలు ముమ్మరం చేస్తా. టీఆర్‌ఎస్‌గా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేస్తూ ఎదిగిన పార్టీ.. నేడు దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే దిశలో జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా ఎదిగింది. రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.
పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేశాం. అదే బాటలో ‘‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’’ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజన్ లేదు. మనం అమలు చేస్తున్న పథకాలను అక్కడ అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత వాహనాల్లో తరలివస్తున్నారు.
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
డబుల్ బెడ్రూం ఇళ్లు, సొంత స్థలంలో ఇంటి నిర్మాణం, దళితబంధు, పోడు భూముల లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసుకోండి. 58, 59 జీవోలతో స్థలాల క్రమబద్ధీకరణ మంచి పథకం. హైదరాబాద్‌లో నోటరీ భూముల క్రమబద్ధీకరణ ఫైలుపై కొత్త సెక్రటేరియట్‌లో సంతకం చేస్తా. గతంలో ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూములు సేకరించాం.
అలా ప్రభుత్వ భూముల లభ్యత ఉన్న చోట లేఔట్లు చేసి.. పట్టాలు పంపిణీ చేసేందుకు సర్వే నంబర్ల వారీగా వివరాలు ఇవ్వండి. అకాల వర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలి. మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొనేందుకు మార్క్‌ఫెడ్‌కు ఆదేశాలిస్తాం..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
పార్టీ ఖాతాలో రూ.1,250 కోట్లు
విరాళాల ద్వారా బీఆర్‌ఎస్ పార్టీ ఫండ్ రూ.1,250 కోట్లకు చేరింది. ఇందులో రూ.767 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినం. దానిపై వస్తున్న వడ్డీలో నుంచి రూ.7 కోట్లను పార్టీ కార్యకలాపాల నిర్వహణ, కార్యాలయాల నిర్మాణం, ప్రచారం, మౌలిక వసతుల కల్పన కోసం ఉపయోగిస్తున్నాం.
బీఆర్‌ఎస్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నిధులతో టీవీ ప్రచార ప్రకటనలు, ఫిలిం ప్రొడక్షన్‌తోపాటు అవసరమైతే జాతీయ టీవీ చానల్‌ను కూడా నడపొచ్చు. ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్ పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వీలుగా పార్టీ జాతీయ అధ్యక్షుడికి అధికారాలు అప్పగిస్తూ బీఆర్‌ఎస్ కార్యవర్గం తీర్మానించింది.
మే 4న ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభం
రాబోయే నెలపాటు అధికారిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ నెల 30న రాష్ట్ర సచివాలయం, మే 4న ఢిల్లీలో నిర్మిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం భవనాన్ని ప్రారంభిస్తాం. జూన్ 1న హుస్సేన్‌సాగర్ తీరాన అమరుల స్మారకాన్ని ఆవిష్కరిస్తాం. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతాయి. ఆ తర్వాత ఎన్నికల దిశగా పార్టీ కార్యకలాపాలపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలి.
చాలాచోట్ల పార్టీ పరిస్థితి బాగానే ఉన్నా.. ఎమ్మెల్యేలు తమ పనితీరును సరిచేసుకోవాలి. ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై మరింత దృష్టి పెట్టాలి. ఎక్కడైనా విభేదాలు ఉంటే.. మెట్టు దిగి సర్దుకుపోయి పార్టీ ప్రతిష్టను పెంచాలి. బీజేపీ గ్రాఫ్ గతంతో పోలిస్తే బాగా పడిపోయింది. వారికి ఓట్లు ఏడెనిమిది శాతం కూడా మించవు.
అర్థ రహిత రాజకీయ విమర్శలకు స్పందించి సమయం వృథా చేసుకోవద్దు. కొన్ని జిల్లా కలెక్టరేట్ల ప్రారంభంతోపాటు పార్టీ జిల్లా కార్యాలయాలను కూడా ప్రారంభించాల్సి ఉంది. వరంగల్, హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment