హైదరాబాద్: సినిమా టికెట్ ధరల పెంపుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరలు పెంచితే మాత్రం అందులో కార్మికులకు 20 శాతం వాటా ఉండాలన్నారు. కార్మికులకు ఆరోగ్య బధ్రత చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలదేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్‌కు సినీ కార్మికులచే అభినందన సభ ఏర్పాటు చేశారు.
తెలుగు సిని పరిశ్రమ 24 క్రాఫ్ట్ సంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వివేక్, పొన్నం, ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ చిన్న సినిమాలను తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదు. కార్మిక కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పిస్తాం. కార్మికులకు రాజీవ్ ఆరోగ్య పథకం అమలు చేస్తాం. కార్మికుల్ని కుటుంబాలుగా చూసుకోవాలని నిర్మాతకు చెప్పా. సినిమా టికెట్లు పెంచితే వచ్చే ఆదాయంతో 20 శాతం కార్మికులకు ఇవ్వాలి. 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌కు బదిలీ అవ్వాలి. ఆ రకంగా అయితే ిటికెట్ ధరలు ెపెంచుకునేందుకు జీవో ఇస్తాం.

నా శక్తి మేర సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తా. గత పదేళ్లుగా నంది అవార్డులు ఇవ్వలేదు.. ఇప్పుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో ఆ అవార్డులు ఇస్తున్నాం. మహా భారతం లో నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు. ప్రాణం పోతుంది అని తెలిసిన స్నేహితుల వైపు ఉన్నాడు. అందుకే మిత్ర ధర్మాన్ని పాటించడంలో నేను కర్ణుడు లాంటి వాడిని. నిర్ణయం తీసుకున్నాక నేను ఆలోచించను. ఎన్ని అడ్డంకులు వచ్చిన కార్మికుల క్షేమం కోసం మిత్ర ధర్మం పాటిస్తాను. డిసెంబర్ 9 నాడు సినీ కార్మికుల కోసం దిశా నిర్దేశం చేసి ప్రణాళిక ఇస్తాము.

కార్మికులు బాగుంటేనే దర్శక నిర్మాతలు బాగుంటారు అని చెప్పిన. కార్మికుల వెల్ఫేర్ కోసం 10 కోట్ల ఫండ్ కేటాయిస్తాము. టికెట్ ధరలు పెంచాలి అంటే అందులో కార్మికులకు వాటా ఇవ్వాలి. టికెట్ ధరలు పెంచితే హీరోలకు నిర్మాతలకు లాభం. మరి కార్మికులకు ఎం ఒరిగింది. కార్మికులకు అదనంగా ఒక్క రూపాయి రావట్లేదు. పెంచిన టికెట్ ధర లో 20 శాతం సినీ కార్మికులకు ఇస్తేనే ప్రభుత్వం జీవో ఇస్తాము. మీ శ్రమతో సంపాదించే ప్రతి దానిలో మీకు వాటా ఉండాలి. ఎంత పెద్ద నిర్మాత అయినా కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ జమ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తది. నేను ఈ విధంగా చేయాలనీ ఆదేశలు ఇస్తున్న’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.


