సాక్షి, వేములవాడ(కరీంనగర్): ఉద్యమనేత, కమ్యూనిస్టు యోధుడు నమిలికొండ పుల్లయ్య ఉరఫ్ గుమ్మి పుల్లన్న(95) ఇకలేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆయన బుధవారం కన్నుమూశారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కమ్యూనిస్టు నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, గుంటి వేణు, కడారి రాములు, వేములవాడ మున్సి పల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్‌చైర్మన్ మధు రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు సంతాపం ప్రకటించారు.
భూపోరాటమే ఊపిరి..
వేములవాడ బద్దిపోచమ్మవీధిలో పెంకుటింట్లో ఆ యన నివాసం. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన.. విద్యార్థిదశ నుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. చిన్నవయసులోనే వేదాలు, వేదమంత్రాలు నేర్చుకున్న ఆయన.. మెట్రిక్యులేషన్ పాసయ్యారు. తన 16వ ఏట భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. రెండేళ్ల తర్వాత సాయుధ పోరాటం ఎంచుకున్నారు. చివరిదశ వరకూ స్వాతంత్య్ర సమరయోధుడి పింఛన్ మంజూరు కాకపోవడం బాధాకరం. సీనియర్ కమ్యూనిస్టు నేత, స్వాతంత్య్ర సమరయోధుడు సీహెచ్ రాజేశ్వర్‌రావుతో సన్నిహితంగా ఉండేవారు. భూపోరాటాల కోసం ఊరూరా తిరుగుతూ రైతులను జాగృతం చేశారు. గడీలపై జెండాలు ఎగురవేశారు. భూముల్లో ఎర్రజెండాలు పాతారు. సిరిసిల్ల ఠాణాపై దాడి చేసి ఆయుధాలు అపహరించారు. తిమ్మాపూర్ మిలటరీ క్యాంపుపై నాలుగువేల మంది రైతులతో కలిసి దాడి చేసి 110 తుపాకులు ఎత్తుకెళ్లారు. పోలీసుల కంటపడకుండా మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు కాలనడకన చేరుకున్నారు.
అక్కడ మూడేళ్లపాటు కోయ, గోండు, నేతకాని, గుత్తికోయలను చైతన్యపరిచి 4 వేల ఎకరాల అటవీ భూములను సాగులోకి తీసుకొచ్చారు. పార్టీ నిర్ణయం మేరకు కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. ఇద్దరు కొరియర్ల సాయంతో ధర్మపురిలోని గోదావరి నది వద్దకు చేరుకున్నారు. అక్కడ స్నానాలు చేస్తుండగా పోలీసులు దాడులు చేసి కొరియర్లను చంపేశారు. పులన్నను అరెస్టు చేసి గుల్బర్గా జైలుకు తరలించారు. మూడేళ్ల జైలుజీవనం అనంతరం జనజీవన స్రవంతిలోకి వచ్చారు. చెన్నారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమంలోనూ పుల్లన్న చురుకుగా పాల్గొన్నారు. ఆయనను తెలంగాణ సాయుధ పోరాటయోధుడిగా గుర్తించి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు సన్మానిస్తూ వస్తున్నారు. పుల్లన్న తల్లిదండ్రులు ఆలియాబాయి–కిష్టయ్య, భార్య రుక్మిణి(చనిపోయారు), కుమారులు పవన్‌కుమార్, మధు మహేశ్, కుమార్తెలు సురేఖ, సునీతతోపాటు 17మంది మనునమలు, మనుమరాండ్రు ఉన్నారు. ఎక్కడికైనా కాలినడకన వెళ్లడం ఆయన ప్రత్యేకత.
Comments
Please login to add a commentAdd a comment