నెలల తరబడి డ్యూటీలోనేనా అంటూ టీజీ పోలీసు కుటుంబ సభ్యుల ఆందోళన
ఖిలా వరంగల్: ‘ నెలల తరబడి డ్యూటీలోనేనా.. వారానికి ఒక్కసారి ఇంటికి పంపరా.. పిల్లలతో అనుబంధాలు తెగిపోతున్నాయి’ అంటూ టీజీ పోలీసు కుటుంబ సభ్యులు మంగళవారం వరంగల్‌లోని రంగశాయిపేట గవిచర్ల క్రాస్ రోడ్డు జంక్షన్‌లో చంటి పిల్లలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ‘కొత్తగా తీసుకొచ్చే లీవ్ మాన్యువల్‌తో నెలకు ఒక్కసారి మాత్రమే ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబానికి దూరమై మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులకు ఒకసారి ఇచ్చే నాలుగు రోజుల పర్మిషన్ లీవ్ పాత పద్ధతినే కొనసాగించాలి’ అని ఈ సందర్భంగా పల్లవి, నవ్యశ్రీ, అంజలి తదితరులు కోరారు.
తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్‌లో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1 నుంచి కొత్తగా తీసుకొస్తున్న లీవ్ మాన్యువల్‌పై పోలీసు కుటుంబాలు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీస్ కుటుంబాలు ఆందోళనకు దిగుతాయని ముందస్తుగా గమనించిన పోలీసులు ఆర్టీఏ జంక్షన్, బెటాలియన్ ప్రధాన గేటు వద్ద భారీగా మోహరించారు. పోలీసుల అంచనాలకు అందకుండా ఇతర ప్రాంతాల్లోని పోలీస్ కుటుంబాలు వివిధ మార్గాల్లో రంగశాయిపేట జంక్షన్‌కు చేరుకొని రోడ్డుపై బైఠాయించాయి.
విషయం తెలుసుకున్న ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, టీజీ ఎస్పీ కమాండెంట్ రాంప్రకాశ్, ఏసీపీలు నందిరాంనాయక్, తిరుపతి, సీఐలు వెంకటరత్నం, రమేష్‌లు మహిళా పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పినా పోలీసు కుటుంబాలు ససేమిరా అనడంతో వారిని వ్యానులో ఎక్కించి బెటాలియన్‌కు తరలించారు. వినతిపత్రం స్వీకరించి సాయంత్రం వదిలేశారు. ఈ కార్యక్రమంలో 200 మంది పోలీసు కుటుంబాలు పాల్గొన్నాయి. బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందిని ఉదయాన్నే స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆఫీసులకే పరిమితం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment