మళ్లీ తెరపైకి తుమ్మిడిహట్టి! | Congress government decision to review irrigation projects | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి తుమ్మిడిహట్టి!

Published Tue, Dec 26 2023 1:37 AM | Last Updated on Tue, Dec 26 2023 1:37 AM

Congress government decision to review irrigation projects - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పునఃసమీక్షకు సిద్ధమైంది. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అంబేడ్కర్‌ ప్రాణహిత–చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ, ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పెండింగ్‌ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసే అవకాశం ఉంది.

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన మేరకు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు చర్చ జరుగుతోంది. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి... అక్కడి నుంచి కాల్వలు, సొరంగాలు, లిఫ్టుల ద్వారా ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి నీళ్లను ఎత్తిపోసే అంశాన్ని కొత్త ప్రభుత్వం పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

కాళేశ్వరంతో పోల్చితే తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బ్యారేజీ నుంచి ఎల్లంపల్లిలోకి నీళ్లను ఎత్తిపోయడానికి నిర్వహణ వ్యయం తక్కువ కానుంది. ఈ నేపథ్యంలో వార్ధా బ్యారేజీ, చెన్నూరు ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వం పక్కనబెట్టనుందని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది.

ఈ నెల 29న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి డి.శ్రీధర్‌బాబు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించాక తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని కాంగ్రెస్‌ గతంలో చాలాసార్లు ఆరోపణలు చేసింది. చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడాన్ని కొత్త ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా ఎంచుకొనే అవకాశం ఉంది. 

వార్ధా, చెన్నూరు లిఫ్ట్‌ బదులు తుమ్మిడిహట్టి... 
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి దాని స్థానంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రతిపాదించిన ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు సరఫరా చేసే అవకాశం లేదు.

ఈ నేపథ్యంలో తుమ్మిడిహట్టి వద్ద గతంలో ప్రతిపాదించిన బ్యారేజీకి బదులుగా.. వార్ధా బ్యారేజీని నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సాగునీరు సరఫరా చేయడానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డీపీఆర్‌ను సైతం సిద్ధం చేసింది. మేడిగడ్డ బ్యాక్‌వాటర్‌ నుంచి చెన్నూరు నియోజకవర్గానికి సాగునీటి సరఫరా చేసేందుకు కొత్త ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సైతం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది.

కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే వార్ధా బ్యారేజీ, చెన్నూరు ఎత్తిపోతల పథకాలను నిర్మించాల్సిన అవసరం ఉండదు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే చెన్నూరుకు గ్రావిటీతోనే సాగునీరు సరఫరా చేయడానికి అవకాశం ఉండగా గత ప్రభుత్వం అనవసరంగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని అప్పట్లో పలువురు రిటైర్డ్‌ ఇంజనీర్లు ఆరోపించారు. 

వేచిచూస్తున్న కాంట్రాక్టర్లు.. 
బిల్లులు వస్తాయనే భరోసా లేకపోవడంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు ఎత్తిపోతల పథకాల పనుల కొనసాగింపుపై కాంట్రాక్టర్లు సైతం పునరాలోచనలో పడ్డారు. కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలపై స్పష్టత వచ్చే వరకు వేచిచూసే ధోరణిలో కాంట్రాక్టర్లు ఉన్నారని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

గత ప్రభు త్వం చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర, నాగమడుగు వంటి ఎత్తిపోతల పథకాల పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో లోపాలు బయటపడటంతో వాటిపై ఆధారపడి నిర్మిస్తున్న ఈ మూడు ఎత్తిపోతల పథకాలను కొనసాగిస్తారా లేదా? అనే అంశంపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే వరకు వేచిచూడాలని కాంట్రాక్టర్లు భావిస్తున్నట్లు తెలిసింది.

భూసేకరణకు సంబంధించిన న్యాయ చిక్కులతో కొంతకాలం కిందే సంగమేశ్వర ఎత్తిపోతల పనులు ఆగిపోగా బసవేశ్వర పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. నాబార్డు నుంచి సంగమేశ్వర కోసం రూ. 2,392 కోట్లు, బసవేశ్వర కోసం రూ. 1,774 కోట్ల రుణం కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు మంజూరు కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement